శ్రీవిష్ణు, కేథరీన్ జంటగా నటించిన చిత్రం భళా తందనాన. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాణం సినిమా దగ్గర నుంచి దర్శకుడు చైతన్య దంతులూరిని చూస్తున్నానని.. ఎవరైనా చిన్న సినిమా చేస్తే చిన్న సినిమా చేస్తున్నట్లు, పెద్ద సినిమా చేస్తే పెద్ద సినిమా చేస్తున్నట్లు పనిచేస్తారని.. కానీ చైతన్య మాత్రం చిన్న సినిమా చేసినా, పెద్ద సినిమా చేసినా పెద్ద సినిమా చేస్తున్నాననే యాటిట్యూడ్‌తో పనిచేస్తారని రాజమౌళి ప్రశంసించాడు. ఒక్క బాణం సినిమాలోనే కాదని.. తాను భళా తందనాన సినిమా కూడా చూశానని.. ఈ సినిమా చాలా బాగుందని.. ఈ సినిమాలోనూ చైతన్య యాటిట్యూడ్ అలాగే కనిపించిందని జక్కన్న తెలిపాడు.
మరోవైపు శ్రీవిష్ణు చాలా టాలెంటెడ్ యాక్టర్ అని.. అతడు ఏ పాత్రలోకి అయినా ఈజీగా పరకాయ ప్రవేశం చేస్తాడని.. మాస్ హీరోగానూ అతడు మౌల్డ్ అవుతాడని రాజమౌళి ప్రశంసించాడు. తెలుగులో ఇలాంటి జోనర్ ఉన్న ఏకైక హీరో శ్రీ విష్ణు మాత్రమే అని రాజమౌళి అన్నాడు. అతడు ఎంచుకునే పాత్రలు చాలా బాగుంటాయని.. భళా తందనానతో శ్రీవిష్ణు తప్పనిసరిగా హిట్ అందుకుంటాడని జోస్యం చెప్పాడు. కేథరీన్ కూడా చాలా బాగా నటించిందని.. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటే ఏదో తూతూ మంత్రంలా కాకుండా సినిమా అంతా ఆమె క్యారెక్టర్ క్యారీ అయ్యేలా మంచి పాత్ర ఇచ్చారని తెలిపాడు. ఇక వారాహి చలనచిత్రం నిర్మాత సాయికొర్రపాటి చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారని.. గత ఐదారు సినిమాలకు ఆయనలో లేని కాన్ఫిడెంట్ భళాతందనాన సినిమాకు చూస్తున్నానని రాజమౌళి పేర్కొన్నాడు. ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాలు ఉండటంతో ఆయన వెయిట్ చేస్తున్నారని.. ఇప్పుడు మంచి టైంలో సినిమాను విడుదల చేస్తున్నారని.. ఓటీటీల నుంచి మంచి ఆఫర్ వచ్చినా ఈ సినిమా బాగా ఆడుతుందనే నమ్మకంతో థియేటర్లలో విడుదల చేస్తున్నారని రాజమౌళి చెప్పాడు. సంగీత దర్శకుడు మణిశర్మ, డీవోపీ సురేష్, ఆర్ట్ డైరెక్షన్.. ఇలా అన్ని విభాగాల్లో సినిమా చాలా బాగా వచ్చిందని రాజమౌళి వెల్లడించాడు.