Prashanth Varma Directing Unstoppable With NBK 2 Trailer: ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ షోపై వ్యూవర్స్‌లో క్రేజ్ పెరగడానికి ప్రధాన కారణం ఆ షో ట్రైలర్. నందమూరి నట సింహం బాలకృష్ణ లోని ఫుల్ ఎనర్జీని డిఫరెంట్ వేలో ఆ ట్రైలర్ లో ప్రెజెంట్ చేశారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆ ట్రైలర్ కు వచ్చిన స్పందనను రెట్టింపు చేస్తూ, షో సైతం ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. గెస్టుల మనసులు నొప్పించకుండా వివాదాస్పదమైన ప్రశ్నలనూ నవ్వుతూ సంధించి, వారి నుండి సమాధానాలు రాబట్టారు బాలకృష్ణ. దాంతో అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి అందరిలో మొదలైంది. దానికి తెర దించుతూ త్వరలోనే ఈ కార్యక్రమం ఉంటుందని ఆహా సంస్థ అధికారికంగా ఇటీవల ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ ను తెరకెక్కించే బాధ్యతను దర్శకుడు ప్రశాంత్ వర్మకే ఆహా అప్పగించింది.
ఈ విషయం గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, ”బాలకృష్ణ గారితో అన్ స్టాపబుల్ సీజన్ 1 ట్రైలర్ చేయడం అనేది గొప్ప ఆనందాన్ని కలిగించింది. రెండో సీజన్ ట్రైలర్ షూట్ చేసే ఛాన్స్ కూడా నాకే రావాలని బలంగా అనుకున్నాను. అలానే ఆ ఛాన్స్ నాకు దక్కింది. దీని కోసం ఓ మంచి కథ గురించి రాయమని ఆహా టీమ్ తెలిపింది. నేను ట్రైలర్ చిత్రీకరణ కోసం రాసిన కథ వారికి నచ్చడంతో ట్రైలర్ ను తీయగలిగాను. విజయవాడలో ఈ నెల 4వ తేదీ దీని ఆవిష్కరణ ఉంటుంది. సో…. అన్ స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పదేళ్ళ క్రితం ‘దీనమ్మ జీవితం’ అనే షార్ట్ ఫిల్మ్ తో కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత ‘అ’, ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించాడు. ప్రస్తుతం ‘హను-మాన్’, ‘అధీర’ చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.