Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దసరా రోజు జరిగే రావణ దహన కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొననున్నాడు. గతంలోనే ఈ విషయంపై వార్తలు రాగా అయోధ్యలో జరిగిన టీజర్ లాంచింగ్ కార్యక్రమంలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. రావణ దహన కార్యక్రమంలో తనతో పాటు ప్రభాస్ పాల్గొంటాడని ప్రకటించాడు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ఇప్పటికే ప్రభాస్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రాంలీలా మైదానంలో అక్టోబర్ 5న విజయ దశమి వేడుకలు జరగనున్నాయి.
Read Also: Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న సోనియాగాంధీ.
కాగా చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా దసరా వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా రావణుడి దిష్టిబొమ్మను కాల్చివేస్తారు. రాంలీలా మైదానంలో ఈ ఏడాది జరిగే దసరా వేడుకలకు అయోధ్యలోని రామ మందిరం రూపంలో నిర్వాహకులు మండపాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి ఏటా ఒక్కో థీమ్‌తో మండపాన్ని నిర్మించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది రావణదహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆదిపురుష్ చిత్రంలో శ్రీ రాముడి పాత్రను పోషిస్తున్న ప్రభాస్ కంటే గొప్పవారు ఎవరుంటారని.. అందుకే ప్రభాస్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.