శుక్రవారం సాయంత్రం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరగాల్సిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడం టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది. పోలీసులు చివరి నిమిషంలో ఎందుకలా చేశారని పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దీని వెనుక రాజకీయకారణం ఉందని కూడా సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. రాజమౌళి తండ్రి బిజెపికి దగ్గర కావడం, జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా భేటీ అవటం వంటి అంశాలను వెలికి తీసి కథనాలు వండారు. అయితే అనుమతి ఎందుకు నిరాకరించారో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ మేరకు అనుమతి నిరాకరిస్తూ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ పేరుతో లెటర్ విడుదల చేశారు. ఆ లెటర్ లో ‘నగరంలో గణేష్ చతుర్థి ఉత్సవాలు జరుగుతున్నందున ఆర్‌ఎఫ్‌సిలో కార్యక్రమానికి అనుమతి ఇస్తే భద్రత కల్పించడానికి సిబ్బంది కొరత ఉంది. అలాగే ఇదే వేదిక వద్ద నిర్వహించిన ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేషనల్ హై వే పై ట్రాఫిక్ జామ్ కి కారణం అయింది. ఇప్పటికే గణేశ్ నిమజ్జనంతో అన్ని ప్రాంతాలు ట్రాఫిక్ తో కిటకిటలాడుతున్నాయి. గతంలో ప్రభాస్ ‘సాహో’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు కూడా లెక్కకుమించి అభిమానులు హాజరుకావటం వేదిక వద్ద అస్థిర పరిస్థితులకు దారితీసింది. నిర్వాహకులు లెక్కకుమించి పాస్ లు ముద్రించటం అనవాయితిగా మారింది. ఇప్పుడు ఈ ‘బ్రహ్మాస్త్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా పదివేల నుంచి పన్నెండు వేల మంది హాజరు కావచ్చని చివరి నిముషంలో అనుమతి కోరారు. అందుకే అనుమతి నిరాకరిస్తున్నాం’ అని పేర్కొన్నారు.