Ponniyin Selvan Reached Another Milestone In 10 Days: దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘పొన్నియిన్ సెల్వన్-1’ సినిమా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తోంది. తొలిరోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతుండడంతో.. భారీ వసూళ్లు కొల్లగొడుతోంది. గత రికార్డులను బద్దలుకొడుతూ.. ఒకదాని తర్వాత మరొక మైల్‌స్టోన్స్ అందుకుంటోంది. తాజాగా ఈ సినిమా రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరింది. కేవలం పది రోజుల్లోనే ఇది ఈ ఘనత సాధించింది. సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమాకు దసరా సెలవులు కూడా కలిసి రావడంతో, కలెక్షన్ల మోత మోగించేసింది. చూస్తుంటే.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దూకుడు ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. ఈ చిత్రం.. తన టోటల్ థియేట్రికల్ రన్‌లోపు మరిన్ని సంచలనాలు నమోదు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాగా.. తన కల్కి మేగజైన్ కోసం 1950 నుంచి మూడేళ్ల పాటు కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ అనే ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తమిళనాడులో ఆ నవలకు ఎంత ప్రజాదరణ దక్కిందో, అంతే ఈ సినిమాకు అందుతోంది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో.. చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిషా కృష్ణన్, జయం రవి, శరత్ కుమార్, శోభితా ధూలిపాళ్ల, ఇంకా తదితర నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. మణిరత్నం ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ని ఎప్పట్నుంచో తీయాలని ప్లాన్ చేస్తుండగా.. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత అది రూపుదిద్దుకుంది. వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో.. దీని సీక్వెల్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.