టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కి మెగా నందమూరి హీరోల మధ్య వార్ జరుగుతుంటే, కోలీవుడ్ లో అజిత్ విజయ్ మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. విజయ్ నటిస్తున్న ‘వారిసు’, అజిత్ నటిస్తున్న ‘తునివు’ సినిమాలు పొంగల్ కి ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. మాములుగానే అజిత్ ఫాన్స్ కి విజయ్ ఫాన్స్ కి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే అంత రైవల్రీ ఉంది. ఈ హీరోల అభిమానులు ఒకరినొకరు తిట్టుకుంటూ సోషల్ మీడియాలో కూడా గొడవపడుతూ ఉంటారు. మా హీరో గొప్ప అంటే కాదు మా హీరో గొప్ప అంటూ గొడవపడే అజిత్, విజయ్ ఫాన్స్ కి 2023 పొంగల్ చాలా ఇంపార్టెంట్. అజిత్ హిట్ కొడితే, విజయ్ ఫాన్స్ ని ట్రోల్ చేస్తారు. విజయ్ హిట్ కొడితే అజిత్ ఫాన్స్ ని ట్రోల్ చేస్తారు. ఏ హీరో ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టాడు అనే దగ్గర నుంచి ఏ హీరో సినిమా ఓవరాల్ గా ఎంత రాబట్టింది అనే వరకూ జరిగే ఈ వార్ కోలీవుడ్ లో హీట్ పెంచే విషయమే.
ప్రస్తుతం అజిత్, విజయ్ నటిస్తున్న సినిమాలు వేరు వేరు జానర్స్ లో తెరకెక్కినవి. అజిత్ ‘తునివు’ సినిమా హెచ్.వినోద్ స్టైల్ లో ఉండే కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ కాగా విజయ్ ది స్టైలిష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వారిసు సినిమాలో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయేమో కానీ అజిత్ సినిమాలో ఉన్నంత ఎక్కువగా ఉండకపోవచ్చు. వారిసు సినిమాలో ఉన్న ఎమోషన్స్, తునివు సినిమాలో ఉండకపోవచ్చు. ఫాన్స్ విషయం పక్కన పెడితే యాక్షన్ పార్ట్ ఎక్కువగా కోరుకునే ప్రేక్షకులు అజిత్ సినిమాకి, ఫ్యామిలీ ఆడియన్స్ విజయ్ సినిమాకి వెళ్లే అవకాశం ఉంది. విజయ్ లాగే అజిత్ కూడా తెలుగు రిలీజ్ కి వస్తాడా? లేక తన సినిమాని కేవలం తమిళనాడు వరకే పరిమితం చేస్తాడా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
నిజానికి అజిత్ విజయ్ మధ్య బాక్సాఫీస్ వార్ కొత్తగా జరిగేదేమి కాదు. 1996 నుంచే ఈ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ జరుగుతోంది. ఆ ఇయర్ లో అజిత్ నటించిన ‘వన్మతి’, విజయ్ నటించిన ‘కోయంబత్తూరు మాప్లా’ అనే సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. అప్పటినుంచి మొదలైన ఈ ఫ్యాన్ వార్, 2001 నుంచి తారాస్థాయికి చేరుకుంది. 2001లో అజిత్ నటించిన ‘ధీనా’, విజయ్ నటించిన ‘ఫ్రెండ్స్’ అనే సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి, రెండు సూపర్ హిట్స్ అయ్యాయి. ఇక్కడి నుంచి రెండు దశాబ్దాలుగా అజిత్ విజయ్ బాక్సాఫీస్ దగ్గర పోటి పడుతూనే ఉన్నారు, వాళ్ల అభిమానాల మధ్య దూరం పెరుగుతూనే వచ్చింది.