అజయ్ దేవగణ్… ఈ పేరు తెలియనివారు ఉండరు. మాస్ హీరోగా అజయ్ దేవగణ్ జనం మదిలో నిలచిపోయారు. తనదైన అభినయంతోనూ అలరించారు. ఓ నాటి మేటి హీరోయిన్ కాజోల్ భర్త అజయ్. హీరోగా ఆయన తొలి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’. ఈ మొదటి సినిమాతోనే అజయ్ మంచి పేరు సంపాదించారు. ఈ చిత్రానికి ప్రముఖ నటి అరుణా ఇరానీ భర్త కుకు కోహ్లి దర్శకుడు. ఈ సినిమాతోనే హేమామాలిని మేనకోడలు మధూ నాయికగా పరిచయమయ్యారు. అజయ్, కోహ్లి, మధూ ముగ్గురికీ ఇదే తొలి చిత్రం కావడం విశేషం! 1991 నవంబర్ 22న విడుదలైన ‘ఫూల్ ఔర్ కాంటే’ విశేషాదరణ చూరగొంది. ఇదే చిత్రం తెలుగులో ‘వారసుడు’గా రీమేక్ అయి, ఇక్కడా విజయం సాధించింది.
కథ విషయానికి వస్తే – ‘గాడ్ ఫాదర్’లో తండ్రి కార్యకలాపాలు నచ్చని ఓ కొడుకు దూరంగా జీవిస్తూ ఉంటాడు. తరువాత తండ్రి మంచితనం తెలుసుకొని, అతనే డాన్ గా మారతాడు. అదే లైన్ తో రూపొందిన చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’. తన చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పడి తల్లిని తండ్రి అశ్రద్ధ చేశాడని, అందువల్లే తల్లి చనిపోయింది అని అజయ్ నమ్ముతూ ఉంటాడు. అతని తండ్రి నాగేశ్వర్ డాన్ గా నేర ప్రపంచాన్ని శాసిస్తున్నా, ఏ నాడూ అతణ్ణి తండ్రి అని చెప్పుకోవడానికి ఇష్టపడడు. కాలేజ్ లో పూజ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు అజయ్. వారికి ఓ పిల్లాడు పుడతాడు. డాన్ గా ఉన్న నాగేశ్వర్ కు మనవడిని చూసుకోవాలన్న తాపత్రయం. అయితే అజయ్ అతని నీడ తన కొడుకుపై పడకూడదని భావిస్తాడు. పిల్లవాడిని నాగేశ్వర్ ఎత్తుకు పోతాడు. అజయ్ దంపతులు కంగారు పడతారు. అయితే, తన శత్రువుల కారణంగా అజయ్ కి అతని భార్యాబిడ్డలకు అపాయం ఉందని భావిస్తాడు డాన్. చివరకు తండ్రి మంచితనం తెలుసుకుంటాడు అజయ్. అతని బాటలోనే పయనిస్తాడు. తన మనవడిని, కోడలిని కాపాడుకొనే క్రమంలో డాన్ ప్రాణాలు పోతాయి. అజయ్ చేతుల్లోనే డాన్ తుదిశ్వాస విడుస్తాడు. దాంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో డాన్ గా అమ్రిష్ పురి నటించారు. మిగిలిన పాత్రల్లో రాజా మురాద్, సత్యేంద్ర కపూర్, అంజనా ముంతాజ్, గోగా కపూర్, సురేశ్ చత్వాల్, అరుణా ఇరానీ, జగ్ దీప్, ఇక్బాల్ దురానీ, పంకజ్ బెర్రీ అభినయించారు. ఈ చిత్రానికి ఇక్బాల్ దురానీ కథ సమకూర్చారు. దినేశ్ పటేల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
నదీమ్-శ్రవణ్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సమీర్, రాణీ మాలిక్ పాటలు రాశారు. ఇందులోని “తుమ్నే మిల్నే కో దిల్ కర్తా హై…”, “ధీరే ధీరే ప్యార్ కో…”, “ఐ లవ్ యూ…”, “జిసే దేఖ్ మేరా దిల్ కా దడ్ఖా…”, “మైనే ప్యార్ తుమ్హీ సే కియా…”, “పెహ్లీ బారిష్ మై ఔర్ తూ…”, “ప్రేమీ ఆషిక్ ఆవారా…” పాటలు అలరించాయి. ‘ఫూల్ ఔర్ కాంటే’ ఘనవిజయం సాధించింది. ఈ సినిమా రూపాయికి మూడు రూపాయల ఆదాయం చూసింది. ఈ చిత్రంతో అజయ్ దేవగణ్ స్టార్ అయిపోయాడు. మధూ తరువాతి రోజుల్లో మధుబాలగా ‘అల్లరి ప్రియుడు’ వంటి కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటించింది. కుకు కోహ్లి ఈ చిత్రం తరువాత “కోహ్రామ్, సుహాగ్, హఖీఖత్, అనారీ నంబర్ వన్” వంటి సినిమాలు రూపొందించారు.