తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఆ పేరే ఓ ప్రభంజనం. ఆయన నటనలో ఉండే వేగం, స్టైల్‌లో ఉండే మేనరిజమ్స్ అన్నింటికి అసంఖ్యాక ఫాన్స్ ఉన్నారు. అలాగే ఆయనకు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కాలం విరామం తర్వాత, జనవరి 7, 2026న పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో ఒక “కొత్త దశ” ప్రారంభం కాబోతున్నట్లు తాజాగా విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ సోషల్ మీడియా అకౌంట్ లో విడుదలైన పోస్టర్‌ను గమనిస్తే, జపాన్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక ఎర్రటి సూర్యుడు, దాని ముందు నిటారుగా ఉన్న కటానా కత్తి కనిపిస్తున్నాయి. ఇది కేవలం సినిమా అనౌన్స్ మెంట్ మాత్రమే కాదు, యుద్ధ విద్యల పట్ల తనకున్న మక్కువను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారని స్పష్టమవుతోంది.
Also Read :Tamannaah : నిమిషానికి కోటి .. తమన్నా రేంజ్ మాములుగా లేదుగా!
పవన్ కళ్యాణ్ తన కెరీర్ ఆరంభం నుండే మార్షల్ ఆర్ట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వచ్చారు. ఆయన కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘జానీ’ వంటి సినిమాల్లో ఆయన ప్రదర్శించిన విన్యాసాలు అప్పట్లో యువతలో ఒక పెను సంచలనం సృష్టించాయి. అప్పటివరకు తెలుగు తెరపై చూడని సరికొత్త ఫైట్ కంపోజిషన్లను ఆయన స్వయంగా డిజైన్ చేసుకునేవారు. ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడమే కాకుండా, తన సినిమాల కోసం నిరంతరం సాధన చేస్తూనే ఉండటం విశేషం. పోస్టర్‌లో పేర్కొన్న “07 01 2026” తేదీ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎన్నో ఆశలను రేకెత్తిస్తోంది. ఈ “కొత్త దశ” అనేది దేని గురించి అయి ఉండవచ్చు? అనేది చర్చనీయాంశం అయింది. ఆయన గతంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకునే యువత కోసం ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చాయి. బహుశా ఆ దిశగా అడుగులు పడుతున్నాయేమో చూడాలి. ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంపై ఏదైనా స్ఫూర్తిదాయకమైన సిరీస్ వచ్చే అవకాశం కూడా ఉంది.