1947 ఆగస్ట్ 15 మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు! ఆ రోజున దేశ రాజధాని ఢిల్లీలోనే కాదు వాడవాడలా జండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. చెన్నయ్ లో ప్రముఖ నటుడు చిత్తూరు వి. నాగయ్య తన చిత్ర బృందంతో కలిసి ఆ రోజున జాతీయ జెండాను ఎగరేశారు. అప్పటి నుండి ప్రతి యేడాది చిత్రసీమ సైతం పంద్రాగస్ట్ వేడుకలను జరుపుకుంటూ వస్తోంది. స్వేచ్ఛావాయువులను పీల్చుతూ భారతదేశం ఈ రోజున 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. అందుకే దేశ స్వాంతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ అమృతోత్సవాన్ని జరపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Read Also : 75వ స్వాతంత్ర్య దినోత్సవం… సెలెబ్రిటీల విషెస్
విశేషం ఏమంటే… ప్రతి సంవత్సరం లానే ఈసారి కూడా సినిమా జనం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నారు. ‘పక్కా కమర్షియల్’ మూవీ టీమ్ మొత్తం షూటింగ్ స్పాట్ లోనే జండా వందన కార్యక్రమాన్ని నిర్వహించింది. దర్శకుడు మారుతీ, హీరోహీరోయిన్లు గోపీచంద్, రాశీఖన్నా, సీనియర్ నటుడు సత్యరాజ్, సప్తగిరి తో పాటు చిత్ర బృందం ఇందులో పాల్గొంది. అలానే వరుణ్ తేజ్ హీరోగా ‘గని’ చిత్రాన్ని రూపొందిస్తున్న టీమ్ సైతం తమ సంస్థ కార్యాలయంలో జండా వందనాన్ని జరిపింది. దీనిలో అల్లు అరవింద్, అల్లు బాబితో పాటు ఇతర చిత్ర యూనిట్ పాల్గొంది.