చిల్డ్రన్ అడ్వంచరస్ టీవీ ప్రోగ్రామ్ ‘మాయా ద్వీపం’ను ఎవరూ అంత తేలికగా మర్చిపోరు! ప్రముఖ యాంకర్ ఓంకార్ నిర్మాతగా మారింది ఆ షో తోనే! ఏడేళ్ళ అనంతరం ఆ షో మరోసారి జీ తెలుగులో సరికొత్త సాంకేతిక ప్రమాణాలతో ప్రసారం కాబోతోంది. ఎప్పటిలానే ప్రతి వారం నలుగురు కంటెస్టెంట్స్ ఈ షోలో పాల్గొంటారు. ఓంకార్ తో పాటు పిల్లమర్రి రాజు, ఒంటికన్ను రాక్షసుడు కూడా ఈ షోలో కీలక పాత్రలు పోషించబోతున్నారు.
ఈ తాజా షో కోసం వైవిధ్యమైన ‘మాయా ద్వీపం’ సెట్ ను వేశారు. దీని గురించి ఓంకార్ మాట్లాడుతూ, ”వందమంది టెక్నీషియన్స్ టీమ్ యాభై రోజుల పాటు రాత్రి పగలు కష్టపడి ఈ సెట్ ను నిర్మించారు. ‘మాయా ద్వీపం’ అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో 6 నుండి 12 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు పాల్గొనబోతున్నారు. ఆడిషన్స్ ప్రకటన రాగానే 12 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయంటే ఈ షో మీద వీక్షకులలో ఉన్న క్రేజ్ ఏమిటనేది అర్థమౌతుంది. దానిని దృష్టిలో పెట్టుకునే ఆసక్తికరంగా దీన్ని డిజైన్ చేశాం. అక్టోబర్ 3న తొలి ఎపిసోడ్ రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది” అని చెప్పారు. మరి ‘మాయాద్వీపం’లోకి ప్రవేశించి, అద్భుత దీపంను సొంతం చేసుకునే వారు ఎవరో వేచి చూడాలి.

