Jagapathi Babu: ప్రముఖ నటుడు జగపతిబాబు కీలక పాత్రపోషించిన ‘రామబాణం’ చిత్రం శుక్రవారం జనం ముందుకు రాబోతోంది. హీరో గోపీచంద్ అన్నయ్యగా ఈ సినిమాలో జగపతిబాబు నటించారు. శ్రీవాస్ దర్శకత్వంలో టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలోని విశేషాలను జగపతిబాబు పాత్రికేయులతో పంచుకున్నారు. ఈ మూవీ యాక్సెప్ట్ చేయడానికి కారణం చెబుతూ, “ఇప్పుడన్నీ హారర్, యాక్షన్, థ్రిల్లర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామా వచ్చి చాలా కాలమైంది. అలాగే గోపీచంద్, శ్రీవాస్, నేను కలిసి గతంలో ‘లక్ష్యం’ చేశాం. ఇది మెయిన్ ఎట్రాక్షన్. అలాగే ‘రామబాణం’లో అన్నదమ్ముల కాన్సెప్ట్ అద్భుతంగా కుదిరింది. గతంలో చేసిన ‘శివరామరాజు’ కూడా కూడా అన్నదమ్ముల కథే. ఆ సినిమా చూసి విడిపోయిన కొన్ని కుటుంబాలు కలిశాయి. ‘రామబాణం’ కూడా చాలా మంచి ఉద్దేశంతో చేసిన సినిమా.” అని అన్నారు.
హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత హాయిగా ఉందని చెబుతూ, “హీరో అనేది పెద్ద భాద్యత. ఇప్పుడా ఒత్తిడి లేకపోవడంతో దర్శకుడు కోరుకునే పెర్ఫార్మెన్స్ డెలివర్ చేయడం ఇంకా సులువవుతుంది. ఇప్పటి వరకూ దాదాపు 70కి పైగా క్యారెక్టర్ రోల్స్ చేశాను. అయితే ఇందులో చెప్పుకోవడానికి ఏడెనిమిది సినిమాలే వున్నాయి. కొన్ని సినిమాల్లో సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి. ‘రామబాణం’లో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ అన్నదమ్ముల కథలో ఇద్దరి పాత్రలు పండితేనే సినిమా ఆడుతుందని గోపీచంద్ ఖచ్చితంగా ఉన్నారు. అది క్లైమాక్స్ లో తెలుస్తుంది. అందుకు స్కోప్ ఇచ్చిన గోపీచంద్ ని మెచ్చుకోవాలి” అని అన్నారు. తన భార్యగా నటించిన ఖుష్బూ గురించి చెబుతూ, “ఆమె నాకు చిన్నప్పటి నుండీ స్నేహం ఉంది. కానీ ఎప్పుడూ సినిమా చేయడం కుదరలేదు. తను మంచి కంఫర్ట్ బుల్ ఆర్టిస్ట్. తనతో ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వర్క్ చేస్తాను” అని చెప్పారు.
Read Also: Today Stock Market Roundup 03-02-23: మణప్పురంపై ‘ఈడీ’ దెబ్బ
సల్మాన్ ఖాన్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ గురించి మాట్లాడుతూ, “ఈ సినిమాతో నాకు ఉత్తరాదిన మంచి మైలేజ్ వచ్చింది. ఇప్పుడు అక్కడ నుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయి” అని తెలిపారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ‘లెజెండ్’లో పాత్ర తనకు బాగా నచ్చిందని, అలానే ‘అరవింద సమేత, రంగస్థలం’ పాత్రలూ ఇష్టమని చెప్పారు. ‘గాడ్ ఫాదర్’ వంటి పాత్ర చేయాలని ఉందని, అలానే ‘గాయం’కు మరోస్థాయిలో ఉండే పాత్ర చేయాలన్నది తన కోరిక అన్నారు జగపతిబాబు. ఈ మధ్యలో వచ్చిన ‘బలగం, కలర్ ఫోటో, కేరాఫ్ కంచరపాలెం’ చిత్రాలు తనకు నచ్చాయని, అలాంటి సినిమాలో భాగం కానందుకు కాస్తంత బాధ కలిగిందని, తాను చిన్న సినిమాలు చేయననే అపోహతో కొందరు ఉన్నారని అది ఎంత మాత్రం నిజం కాదని జగపతిబాబు చెప్పారు. పాత్ర నచ్చితే, రెమ్యూనరేషన్ కు ప్రాధాన్యం ఇవ్వనని స్పష్టం చేశారు. తాను చేయాలనుకున్న ‘సముద్రం’ వెబ్ సీరిస్ ఆశించినట్టు రాకపోవడంతో దానిని పక్కన పెట్టేశానని చెప్పారు.