అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల గొడవ ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. నిత్యం వారి విడాకులపై ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి అక్కినేని నాగార్జుననే కారణం అని, ఆయన వలనే ఈ జంట మధ్య విబేధాలు వచ్చాయని పలు యూట్యూబ్ ఛానెల్స్ , సోషల్ మీడియాలో వైరల్ చేశాయి. కొన్ని విషయాల్లో సామ్ పనులు, నాగ్ కి నచ్చలేదని, చైతూ కి ఆ విషయాలను చెప్పి సామ్ పద్దతి మార్చుకోవాలని చెప్పడంతో సామ్ వాటికి ఇష్టంలేక బయటికి వచ్చేసినట్లు వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి.
ఇక తాజగా ఈ వార్తలపై నాగార్జున స్పందించారు. ఇప్పటివరకు కొడుకు, కోడలు విడాకుల విషయంలో అంతగా స్పందించని నాగ్.. ఒక జాతీయ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నోరు విప్పారు. చైతన్య విడాకుల విషయంలో మీ మీద వచ్చిన వార్తలు విన్నప్పుడు మీకు బాధ అనిపించలేదా..? అన్న ప్రశ్నకు నాగ్ మాట్లాడుతూ” చై- సామ్ విడాకులకు కారణం నేనే.. వారిని విడదీసింది నేనే అనే వార్తలు విన్నప్పుడు కూడా నేను బాధపడలేదు. కానీ, నా కుటుంబం గురించి అన్నప్పుడు చాలా బాధపడ్డాను. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న సూక్తిని నేను నమ్ముతాను. అందుకే నాపై ఎలాంటి వార్తలు వచ్చినా పెద్దగా పట్టించుకోను. కానీ నా ఫ్యామిలీ గురించి చేదుగా రాశారు. అవి నన్ను చాలా ఇబ్బందికి గురిచేశాయి” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం నాగ్, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకొంటుంది.