మెలోడి బ్రహ్మగా తెలుగు సంగీత ప్రియులతో పిలిపించుకున్న మణిశర్మ, ఒక సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు అంటే అందులోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటాయి అనే నమ్మకం అందరికీ ఉంటుంది. సమరసింహా రెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు, పోకిరి లాంటి మాస్ సినిమాల్లో మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ సినిమాలకే ప్రాణం పోసింది. హీరో ఎలివేషన్ సీన్ పడుతుంది అంటే చాలు మణిశర్మ థియేటర్ మొత్తం ఊగిపోయే రేంజులో బీజీఎం కొడతాడు. ప్రతి హీరోకి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చే మణిశర్మ చిరంజీవి సినిమాకి చాలా స్పెషల్ గా కంపోజ్ చేసేవాడు. చిరు మణిశర్మల కలయికలో ‘చూడాలని ఉంది’, ‘స్టాలిన్’, ‘ఠాగూర్’, ‘మృగరాజు’, ‘ఇద్దరు మిత్రులు’, ‘జై చిరంజీవా’, ‘అంజి’, ‘బావగారు బాగున్నారా’, ‘ఇంద్ర’ లాంటి చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ వచ్చాయి. ఈ సినిమాల్లో ఏది హిట్ ఏది ఫ్లాప్ అనేది పక్కన పెడితే ప్రతి సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ప్రేక్షకులని మెప్పించాయి. అందుకే చిరు మణిశర్మల కాంబినేషన్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ఎన్నో చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చాడు కాబట్టే మణిశర్మ ‘ఆచార్య’ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనౌన్స్ అవ్వగానే మెగా అభిమానులంతా ఖుషి అయ్యారు. వింటేజ్ వైబ్స్ ని చూడబోతున్నాం అనే ఫీలింగ్ తో థియేటర్స్ కి వచ్చిన మెగా అభిమానులు ‘ఆచార్య’ సినిమా చూసి డిజప్పాయింట్ అయ్యారు. కథలో విషయం లేకపోవడంతో ‘ఆచార్య’ ఫ్లాప్ అయ్యింది అనే మాట పక్కన పెడితే, మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒకప్పటి రేంజులో లేదు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఈ విషయంపై ఇప్పటివరకూ స్పందించని మణిశర్మ, తాజాగా ఒక షోలో హోస్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా “కోటి, కీరవాణి లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర చిరు సినిమాలకి పని చేస్తూ ఇండస్ట్రీలోకి వచ్చాను. చిరుకి మ్యూజిక్ ఎలా కొట్టాలో నాకు తెలుసు, నేనో వర్షన్ కొట్టాను. ఆ తర్వాత దర్శకుడు కొరటాల శివ వచ్చి మీరు ఎలా అనుకుంటున్నారో అలా వద్దు, కొత్తగా కొట్టాలి అన్నాడు. సరే ప్రయోగం చేద్దాం అని అలా చేశాము” అని చెప్పుకొచ్చాడు. మణిశర్మ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొరటాల శివ కావాలనే ‘ఆచార్య’ సినిమాని ఫ్లాప్ చేశాడు అంటూ కొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ కొందరు సినీ అభిమానులు ఏ దర్శకుడికి అయినా తన ప్రతి సినిమాని హిట్ కొట్టాలనే తీస్తాడు. కొన్నిసార్లు అవి వర్కౌట్ అవుతాయి కొన్నిసార్లు అవి అవ్వకపోవచ్చు అందులో ఒకరినే తప్పుబట్టడం కరెక్ట్ కాదంటూ కొరటాలకి సపోర్ట్ చేస్తున్నారు.