మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆచార్య.. మెగా అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక నిన్నటికి నిన్న ఆచార్య ట్రైలర్ రిలీజ్ అయ్యి రికార్డుల ప్రభంజనం సృష్టిస్తున్న విషయం విదితమే. మెగా ఫ్యాన్స్ ఆచార్య నుంచి ఎలాంటి అంశాలని అయితే కోరుకుంటున్నారో అదే తరహా ఎమోషన్ యాక్షన్ అంశాలతో ట్రైలర్ ని కట్ చేశాడు కొరటాల .. నిజం చెప్పాలంటే ఈ ట్రైలర్ ను ఏమైనా బోయపాటి శ్రీను కట్ చేశాడా ..? ట్రైలర్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో నింపేసి గూస్ బంప్స్ తెప్పించేశారు అని మెగా అభిమానులు డౌట్ పడుతున్నారు.
ఇక ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ ట్రైలర్ గురించి ఒక పోల్ నడుస్తోంది. అదేంటంటే.. ఆచార్యలో అతిథి పాత్ర చరణ్ దా? .. లేక మెగాస్టార్ దా? అని.. ట్రైలర్ ని చూసిన ప్రతి ఒక్కరికి ఇదే అనుమానం వస్తుంది. కొరటాల.. చిరుకు కథ వినిపించినప్పుడు చరణ్ ఒక గెస్ట్ రోల్ లో కనిపిస్తే బావుంటుంది అని చెప్పడం, వెంటనే చిరు ఒప్పుకోవడం జరిగిపోయాయి. ఇక ఆ తరువాత కొరటాల సిద్ద పాత్ర గెస్ట్ రోల్ గా కాకుండా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో మహా అయితే చరణ్ కనిపించినా ఒక 15 నిముషాలు.. లేక ఒక 25 నిముషాలు కనిపిస్తాడు అనే లెక్కలోనే ఉన్నారు.
ఇక ట్రైలర్ చూస్తే మొదటి నుంచి చివర వరకు చరణ్ మాత్రమే కనిపించాడు. చిరునే గెస్ట్ రోల్ చేస్తున్నట్లు కనిపించాడు. దీంతో ఈ కథపై కొత్త కొత్త కథనాలు రైజ్ అవుతున్నాయి.. కొరటాల తండ్రికొడుకులతో మల్టీస్టారర్ తీసినట్టుంది.. ఫస్ట్ హాఫ్ మొత్తం చరణ్ ఉంటాడు.. మధ్యలో సోనూసూద్ చరణ్ ను చంపేస్తే.. అతను ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి చిరు రంగంలోకి దిగుతాడు.. వీరిద్దరికి ప్లాష్ బ్యాక్ ఉంటుంది.. అడవుల్లో వీరిద్దరూ గురు శిష్యులు అని క్లైమాక్స్ లో రివీల్ చేస్తారని కొత్త కథను చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడాలంటే ఏప్రిల్ 28 వరకు ఆగాల్సిందే.