మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా ‘జిన్నా’. ఎవిఎ ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ మీద మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీని ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్నాడు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ కాగా పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. శుక్రవారం ఈ మూవీ టీజర్ ను తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. బ్యాడ్ టైమ్ ను వెంట తెచ్చే జిన్నా అంటే రంగాపురంలోని అందరికీ హడల్.
అలాంటి జిన్నా జీవితం లక్ష్మీదేవి లాంటి సన్నీ లియోన్ ఎంట్రీతో ఎలా మారిందన్నదే కథ. జిన్నా క్యారెక్టరైజేషన్ ను తెలియచేసే విధంగా ఈ టీజర్ సాగింది. దానికి తోడు ఈ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ కు పెద్ద పీట వేశారన్నదీ టీజర్ చూస్తే తెలుస్తోంది. రఘుబాబు, త్రిపురనేని చిట్టీ, సునీల్, నరేశ్, చమ్మక్ చంద్ర, డాక్టర్ భద్రం తదితరులు ఈ టీజర్ లో కనిపించారు. పాయల్ రాజ్ పూత్ కంటే సన్నీలియోన్ ఎంట్రీ కాస్తంత భిన్నంగా ఉంది. ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ తో పాటు హారర్ ఎలిమెంట్స్ కూడా ఈ టీజర్ లో చోటు చేసుకోవడం విశేషం. ఈ మూవీని మూడు భాషల్లో అక్టోబర్ లో విడుదల చేయబోతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న ‘జిన్నా’కు కథ జి. నాగేశ్వరరెడ్డి, మాటలు, చిత్రానువాదం కోన వెంకట్.