ప్రముఖ హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ కు ఇండియాలోని కేరళలో ఓ ఆసుపత్రి కారణంగా అవమానం జరిగింది. కేరళలోని ఆ ఆసుపత్రి పేరు వడకర కార్పోరేటివ్ హాస్పిటల్. మోర్గాన్ ఏమైనా ఆ ఆసుపత్రికి ట్రీట్ మెంట్ కు వచ్చారా? అంటే లేదు. మరి ఆ హాస్పిటల్ లో ఈ హాలీవుడ్ నటునికి జరిగిన అవమానమేంటి? ఈ వడకర కార్పోరేటివ్ హాస్పిటల్ లో ఓ అడ్వర్టైజ్ మెంట్ కు హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ బొమ్మ ఉపయోగించుకున్నారు. అందులో తప్పేముంది అంటారా? తప్పా తప్పున్నర్రా! ఒక సెలబ్రిటీ ఫోటో ఉపయోగించుకొనే ముందు వారి అనుమతి తీసుకోవాలి. లేదా వారికి సంబంధించిన వారసుల అనుమతి అయినా తీసుకొనక తప్పదు. కానీ, ఇవేవీ లేకుండానే వడకర కార్పోరేటివ్ హాస్పిటల్ మోర్గాన్ బొమ్మ ఉపయోగించుకుంది.
ఈ ఆసుపత్రి వారు తమ దగ్గర పులిపుర్లు, మచ్చలు, పొడలు వంటి చర్మవ్యాధులకు అద్భుతంగా చికిత్స చేస్తాము అని ప్రకటించుకొనే క్రమంలో ఆ యాడ్ కు మోర్గాన్ బొమ్మను ఉపయోగించుకున్నారు. ఈ యాడ్ ను చూసిన నెటజన్లు సదరు వడకర కార్పోరేటివ్ హాస్పిటల్ ను ట్రోల్ చేశారు. దాంతో మోర్గాన్ బొమ్మ ఉపయోగించినందుకు క్షమాపణ చెబుతూ, ఆ యాడ్ ను తొలగించారు. నెటిజన్ల ధాటికి తట్టుకోలేక ఆ బొమ్మ తొలగించారని అందరూ భావిస్తున్నారు. అయితే ఆసుపత్రికి చెందిన ప్రతినిధి అసలు విషయం చెప్పారు. అదేమిటంటే, ఈ మధ్య తమ ఆసుపత్రికి ఓ కొత్త చర్మవ్యాధి నిపుణులు వచ్చారని ఆయన సూచనల మేరకు తమ ఆసుపత్రిలో ఏ యే చర్మవ్యాధులకు విజయవంతంగా చికిత్స చేస్తామో తెలుపుతూ యాడ్ రూపొందించారని వివరించారు. అందులో డిజైనర్ హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ బొమ్మను డమ్మీ యాడ్ లో ఉపయోగించాడు. అయితే తరువాత దానిని తీసివేయకుండానే యాడ్ ను ప్రింట్ చేసి, ఔట్ పేషెంట్ డిపార్ట్ మెంట్
ముందు తగిలించారు. ఇటీవల కొందరు ఆ ప్రకటనను చూసి, ఎందుకని ఆ చర్మవ్యాధుల ప్రకటనలో నెల్సన్ మండేలా బొమ్మ పెట్టారు
అని సిబ్బందిని ప్రశ్నించారట. అప్పుడు ఆసుపత్రి సిబ్బందికి తాము చేసిన తప్పేమిటో తెలిసి వచ్చిందట! తరువాత ఆ ప్రకటనను తీసేయడమే కాదు, ఎక్కడా రాకుండా చూసుకున్నారట!
ఇంతకూ ఇక్కడ నెల్సన్ మండేలా పేరు ఎందుకు వచ్చింది? ప్రఖ్యాత హాలీవుడ్ యాక్టర్ – డైరెక్టర్ క్లింట్ ఈస్ట్ వుడ్ తెరకెక్కించిన ఇన్ విక్టస్
అనే చిత్రంలో మోర్గాన్ ఫ్రీమన్ నెల్సన్ మండేలా
పాత్ర పోషించారు. అందువల్ల ఆ సినిమా చూసిన జనానికి, ఆ బొమ్మలో ఉన్న నటుని పేరు మోర్గాన్ అని తెలియదు, ఆయన పోషించిన పాత్ర నెల్సన్ మండేలా
గుర్తుంది. దాంతో ఆసుపత్రిలోని ప్రకటనలో మోర్గాన్ ను చూసి నెల్సన్ మండేలా
అని భావించారు. అదన్నమాట అసలు కథ! ఏమయితేనేం, మోర్గాన్ బొమ్మ ఉపయోగించుకున్న సదరు ఆసుపత్రి క్షమాపణ చెప్పింది.