రీసెంట్‌గా వచ్చిన ట్రిపుల్ ఆర్, కెజియఫ్ చాప్టర్ 2.. మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. ఇక ఇప్పుడు మరో యాక్షన్ సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతోంది. కమల్ హాసన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘విక్రమ్’ ఊర మాస్‌గా రాబోతోంది. పైగా మాస్ డైరెక్టర్ కావడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. మరి ఈ సినిమా స్పెషాల్టీ ఏంటి.. కమల్ హాసన్ హిట్ కొట్టేనా..?
2018లో వచ్చిన విశ్వరూపం 2 తర్వాత.. మరో సినిమా చేయలేదు కమల్ హాసన్. దాంతో దాదాపు నాలుగేళ్ల తర్వాత ‘విక్రమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జూన్ 3న ‘విక్రమ్’ పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఖైదీ, మాస్టర్ వంటి సినిమాలతో మాస్ దర్శకుడిగా సత్తా చాటిన.. లోకేష్ కనగరాజ్ ఈ మూవీని తెరకెక్కించాడు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసనే ఈ మూవీని నిర్మించారు. ఇందులో విజయ్ సేతుపతి.. ఫహద్ ఫాజిల్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటించారు. అలాగే సూర్య కూడా గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడు. దాంతో విక్రమ్ పై భారీ అంచనాలున్నాయి. అంతేకాదు కమల్ మళ్లీ ఈ మూవీతో తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవడం ఖాయమంటున్నారు లోకనాయకుడి అభిమానులు. కమల్ హాసన్ కూడా ఈ సినిమా అవుట్ పుట్ చూసి.. గట్టి కాన్ఫిడెన్స్ తో వున్నారట. అందుకే రెట్టించిన ఉత్సాహంతో విక్రమ్‌ను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా.. ‘విక్రమ్’ సినిమాకు రెండు సీక్వెల్స్ చేయబోతున్నానని ప్రకటించారు. ఈ రెండు సీక్వెల్స్ కు కూడా లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా వ్యవహరిస్తాడని స్పష్టం చేశారు. అంతేకాదు ఇదే అసలైన పాన్ ఇండియా అని చెబుతున్నాడు. దాంతో ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 తర్వాత వస్తున్న మరో సినిమాగా విక్రమ్ నిలుస్తుందని అంటున్నారు. అందుకే ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్‌పై, నిర్మాత సుధాకర్ రెడ్డి.. తెలుగులో 400కు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఏదేమైనా విక్రమ్ పై కమల్ భారీ ఆశలే పెట్టుకున్నారని చెప్పొచ్చు.