Surya Vashistta: పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘బుట్టబొమ్మ’. మలయాళ చిత్రం ‘కప్పేల’కు ఇది రీమేక్. శౌరి చంద్రశేఖర్ రమేశ్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం 4వ తేదీ జనం ముందుకు వస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సూర్య వశిష్ఠ గురువారం మీడియాతో ముచ్చటించారు. తన సినీ రంగ ప్రవేశం గురించి చెబుతూ, ”మా నాన్నగారు 30 ఏళ్లకు పైగా చిత్రసీమలో ఉన్నారు. ఆయనను అందరూ ‘సత్యం గారు’ అని పిలుస్తారు. రాఘవేంద్రరావు, రాజమౌళి, త్రివిక్రమ్ గార్ల దగ్గర కో-డైరెక్టర్ గా పనిచేశారు. నన్ను నటుడిగా చూడాలనేది ఆయన కోరిక. నాక్కూడా సినిమాలంటే చాలా ఇష్టం. అమెరికాలో చదువు పూర్తి చేసి, కొంతకాలం ఉద్యోగం చేశాక ఇక్కడికి వచ్చి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఒకసారి నాన్నగారు ‘కప్పేల’ సినిమాని చూపించి, ఇందులోని ఆటో డ్రైవర్ పాత్ర నీకు సరిగ్గా సరిపోతుందని అన్నారు. ఆ తర్వాత ఆ మూవీ రీమేక్ రైట్స్ సితార సంస్థ తీసుకోవడంతో, ‘మా వాళ్లే తీసుకున్నారు’ అంటూ ఎంతో సంతోషించారు. కానీ నాన్నగారు కోవిడ్ తో మరణించడంతో ఒక ఏడాది పాటు అసలు బయటకు రాలేదు. ఆ తర్వాత ఒకసారి త్రివిక్రమ్ గారిని కలిస్తే ఆయన సూచన మేరకు సితారలో ఆడిషన్ ఇచ్చాను. అలా ‘బుట్టబొమ్మ’ చిత్రానికి ఎంపిక అయ్యాను. మా నాన్నగారి చివరి కోరిక నెరవేరేలా చేసిన త్రివిక్రమ్ గారికి, సితార సంస్థకి జీవితాంతం రుణపడి ఉంటాను” అని అన్నారు.
ఈ చిత్రంలో నటించడం గురించి చెబుతూ, ”మలయాళ వెర్షన్ చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో ఇంత అద్భుతమైన పాత్ర పోషించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. నాకు ఎప్పుడూ ఇలాంటి కొత్తదనం ఉన్న పాత్రలు పోషించాలని ఉంటుంది. ఈ సినిమాలో నా పాత్ర కొత్తగా, ఆకట్టుకునేలా ఉంటుంది. ఇందులో మిగిలిన రెండు పాత్రలు కూడా చాలా ప్రధానమైనవి. ముఖ్యంగా ఇందులో హీరోయిన్ గా నటించిన అనిఖా మంచి మనసున్న అమ్మాయి. తనకు తెలుగు రాకపోవడంతో కొన్ని కొన్ని సంభాషణల్లో సాయం చేసేవాడిని. అర్జున్ దాస్ అప్పటికే స్టార్. ఆయన తన గొంతుతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. షూటింగ్ సమయంలో ఆయన నాకు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారు. ఇక దర్శకుడు రమేష్ ప్రతి సన్నివేశం, ప్రతి షాట్ మీద చాలా వర్క్ చేస్తారు. మంచి ఔట్ పుట్ కోసం ఆయన ఎన్ని టేక్ లు అయినా తీసుకుంటారు. దాంతో ముఖంలో ఆ అలసట కనిపించకుండా నటించాల్సి వచ్చేది. అలాగే క్లైమాక్స్ షూటింగ్ సమయంలో గాయాలపాలై ఆస్పత్రిలో చేరాను” అని ఆనాటి సంఘటనను సూర్య వశిష్ఠ గుర్తు చేసుకున్నాడు.
కొత్త అవకాశాల గురించి చెబుతూ, ”నాకు సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు అంటే ఇష్టం. అలాంటి సినిమాల్లోనే ఎక్కువగా నటించాలి అనుకుంటున్నాను. ‘బుట్టబొమ్మ’ టీజర్ విడుదలయ్యాక పలువురు నూతన దర్శకులు నన్ను సంప్రదించారు. మరికొన్ని కథలు విని, ‘బుట్టబొమ్మ’ విడుదల తర్వాత నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను. రాజమౌళి, త్రివిక్రమ్ గార్లను చాలా దగ్గర నుండి గమనించాను. వారితో కలిసి పనిచేసే అవకాశం వస్తే అసలు వదులుకోను” అని చెప్పారు.