బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ను అభిమానులు ప్రేమగా గ్రీక్ గాడ్ అనిపిలుచుకుంటారు. భార్య సుసానే ఖాన్ నుండి విడాకులు తీసుకున్న దగ్గర నుండి హృతిక్ రోషన్ సింగిల్ స్టేటస్సే మెయిన్ టైన్ చేస్తున్నాడు. దాంతో అందరి కళ్ళూ అతని మీదనే కొంతకాలంగా ఉంటున్నాయి. హృతిక్ బయట ఎక్కడ కనిపించినా, అతనితో ఎవరైనా మహిళలు ఉన్నారా అని మీడియా చూపులు సారిస్తూనే ఉంది. మొత్తానికి వారికి శుక్రవారం రాత్రి మంచి కంటెంట్ దొరికింది.
హృతిక్ రోషన్ ఓ రెస్టారెంట్ లోంచి ఓ మహిళ చేయి పట్టుకుని పార్కింగ్ దగ్గర ఉన్న తన కారు వరకూ తీసుకొచ్చి ఎక్కించాడు. అయితే వీరిద్దరి ముఖాలకూ మాస్క్ ఉండటంతో హృతిక్ ను చుట్టూ ఉన్న జనం పోల్చుకున్నారు కానీ ఆ అమ్మాయి ఎవరో వారికి అర్థం కాలేదు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే సహజంగానే వైరల్ అయిపోయింది. దాంతో ఆ మహిళను గుర్తుపట్టే పనిలో నెటిజన్లు పడ్డారు. మొత్తానికి ఆమెను ఓటీటీ స్టార్ సబా అజాద్ గా వారు గుర్తించారు. 2011లో ‘ముఝ్ సే ఫ్రెండ్ షిప్ కరోగి’తో పాటు, గత యేడాది నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన ఆంథాలజీ ‘ఫీల్స్ లైక్ ఇష్క్’లో సబా నటించింది. అలానే ఆమె నటించిన ‘రాకెట్ బాయ్స్’ సీరిస్ సోనీ లివ్ లో ప్రసారం కానుంది. సబా చేతిలో చెయ్యి వేసి హృతిక్ అంత కేరింగ్ గా కారు ఎక్కించాడంటే వీరద్దరి మధ్య సమ్ థింగ్ ఉన్నట్టేనని, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు అనిపిస్తోందని నెటిజన్స్ ఓ నిర్థారణకు వచ్చేశారు. తమ మీదే కెమెరాలన్నీ ఫోకస్ చేస్తున్నాయని తెలిసి కూడా హృతిక్ ఎలాంటి దాపరికం లేకుండా ఆమెతో పాటు కారు వరకూ వచ్చాడంటే… ఇందులో దాచాల్సింది ఏమీ లేదనే అభిప్రాయంలో అతను ఉండి ఉండొచ్చని మీడియా సరికొత్త అర్థాలు తీస్తోంది. మరి హృతిక్, సబా ఆజాద్ ఈ వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.