AHA: ఆహాలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 మరో స్థాయికి చేరుకుంది. లాస్ట్ సీజన్ లో టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ తో కలిసి సందడి చేసిన నందమూరి నట సింహం బాలకృష్ణ ఈసారి వేలాది మందిలోంచి ఎంపికైన పన్నెండు మంది కంటెస్టెంట్స్ ను పరిచయం చేశారు, అయితే అది ర్యాప్ సాంగ్ రూపంలో కావడం విశేషం. తెలుగు ఇండియన్ ఐడల్ కు ఎంపికైన శ్రుతి, జయరాం, ప్రణతి, కార్తీక్, లాస్య ప్రియ, చక్రపాణి, మానస, ఆదిత్య, సౌజన్య, వైష్ణవి, సాకేత్, యుతి లను ఒక్కొక్కరిగా వేదికపైకి రాగయుక్తంగా పిలుస్తూ… బాలకృష్ణ వారితో కలిసి స్టెప్పులేశారు. ఆ తర్వాత అదే ఊపులో న్యాయ నిర్ణేతలు తమన్, గీతామాధురి, కార్తీక్ లనూ ఆహ్వానించారు. ఎన్బీకే టాప్ 12 కంటెస్టెంట్స్ ను ప్రెజెంట్ చేయగానే… ‘జై బాలయ్యా’ అంటూ ఫ్లోర్ దద్దరిల్లింది. శుక్రవారం ఎపిసోడ్ లో విశాఖ నుండి వచ్చిన సౌజన్య మొదటగా పాట పాడింది. బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమీ శాతకర్ణి’లోని ఆ పాట వినగానే బాలయ్య ఖుషీ అయిపోయారు. బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అంటూ కితాబిచ్చారు. అంతేకాదు… సౌజన్య చిట్టి కూతురుకు బాలకృష్ణ వెండి కాలి పట్టీలను కానుకగా ఇచ్చారు. ఆ తర్వాత సాకేత్… విశ్వక్ సేన్ మూవీ ‘ఫలక్ నుమా దాస్’లోని మెలోడీ గీతాన్ని పాడి ఆకట్టుకున్నాడు. అతన్ని బాలకృష్ణ అభినందించాడు.
మూడో కంటెస్టెంట్ గా వచ్చిన లాస్య ప్రియ ‘సింహా’ చిత్రంలోని టైటిల్ సాంగ్ ను ఆలపించింది. సిద్ధపేట నుండి తన బామ్మ… బాలకృష్ణకు చూడానికి వచ్చారని చెప్పడంతో ఆమెను స్టేజ్ ఎక్కించారు. తాను ఎన్టీయార్ అభిమానినని, ఆయన పోషించిన రాముడు, కృష్ణుడు పాత్రల చిత్రపటాలను తాను ఇంట్లో పెట్టుకున్నానని బామ్మగారు చెప్పారు. అంతేకాదు… బాలకృష్ణతో కలిసి ‘నన్ను దోచుకొందువటే…’ గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత ఆమెకోసం బాలకృష్ణ ప్రత్యేకంగా బొబ్బట్లు వేసి పెట్టారు. ఈ ఎపిసోడ్ లో చివరగా మానస ‘సీతయ్య’ సినిమాలోని ‘ఒక్క మగాడు’ పాటను పాడింది. ముందుపాట సమయంలో తన తండ్రి ఎన్టీయార్ ను తలుచుకున్న బాలయ్య… ఈ సినిమాలో హీరోగా నటించిన అన్న హరికృష్ణను స్మరించుకున్నారు. ఆమెది బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అంటూ కితాబిచ్చారు. బాలకృష్ణ ఎంట్రీతో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2లో జోష్ పెరిగింది. బాలకృష్ణ తనదైన మార్క్ పంచ్ లతోనూ కొందరితో ఆడుకున్నాడు. ముఖ్యంగా హేమచంద్ర, కార్తీక్ లను ఆటపట్టించాడు.