నందమూరి బాలకృష్ణకు మాస్ లో అంతలా ఫాలోయింగ్ ఉండడానికి కారణమేంటి అంటే, ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక ఆయన పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ పరవశింప చేస్తుంటాయి. అందువల్ల మాస్ ఇట్టే ఆయనకు ఆకర్షితులయిపోతారు. సినిమాల్లోనే కాదు, బాలకృష్ణ నిర్వహిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ -యన్బీకే’ చూసినా ఆ విషయం ఇట్టే అర్థమై పోతోంది. ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ టాక్ షో రెండో ఎపిసోడ్ నవంబర్ 12న జనం ముందు నిలచింది. ఈ రెండో ఎపిసోడ్ లో యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా హాజరయ్యారు. 44 నిమిషాల 50 సెకండ్ల పాటు ఈ ఎపిసోడ్ సాగింది.
ఆకట్టుకున్న స్టేజ్ క్రికెట్!
మునుపటిలాగే “నేను మీకు తెలుసు…” అంటూ బాలయ్య ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంది. నానికి ఇంట్రో రాసిన వారెవరో కానీ, అతని ఇమేజ్ కు తగ్గట్టుగా పదాలు పలికించారు. ‘సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడు కాదు… మీ నుండి వచ్చిన వాడు…” అంటూ నానిని వేదికపైకి ఆహ్వానించారు బాలయ్య. అప్పటి దాకా నాని జనం మధ్యలో కూర్చుని ఉండడం, అక్కడ నుండే స్టేజ్ పైకి రావడం ఆకట్టుకున్న అంశాలు. మొదటి ప్రశ్ననే “మోస్ట్ ఛాలెంజింగ్ గా ఫేస్ చేసిన కేరక్టర్ ఏది?” అని బాలకృష్ణ అడిగారు. దానికి నాని తడుముకోకుండా “జెర్సీ.. ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది” అని చెప్పడంతో, బాలయ్య అభినందనలూ అందుకున్నారు. ‘జెర్సీ’ క్రికెట్ నేపథ్యం కాబట్టి, దానిని చర్చిస్తూ, తాను నిజామ్ కాలేజ్ క్రికెట్ టీమ్ లో అజరుద్దీన్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలసి క్రికెట్ ఆడేవాళ్ళమని బాలయ్య గుర్తు చేసుకున్నారు. నానితో క్రికెట్ ఆడటానికి స్టేజ్ పైనే సెటప్ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన క్రికెట్ ప్యాటరాన్ ను బట్టి నాని ఆరు బాల్స్ ఆడగా, వరుసగా ఐదు సిక్సులు నమోదయ్యాయి. చివరి బంతి మిస్ అయింది. ఇక బాలయ్య ఏడు బంతులు ఆడి నాలుగు సిక్సర్ కొట్టాక, ఆయనే “నానీ నువ్వు గెలిచావయ్యా…” అన్నారు. నానిని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గానూ డిక్లేర్ చేశారు బాలయ్య.
మురిపించే ముచ్చట్లు!
ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ తనపై “బాపు గారి ప్రభావం” ఎంతో ఉందని నాని చెప్పారు. నాని తాను ఆర్.జె.గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ అది ‘నాన్ స్టాపబుల్’, ఇది ‘అన్ స్టాపబుల్’ అనడం అలరించింది. అలాగే ఆర్జే రోజుల్లో బాలయ్య ‘ఆదిత్య 369’లోని “సెంచరీలు కొట్టే వయస్సు మాది…” సాంగ్ గురించి ఎలా ఇంట్రో ఇచ్చానో చెప్పి మురిపించారు నాని. తాను ఎలా యాక్టర్ అయ్యానో నాని చెప్పిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. జనం గుర్తు పట్టి వెంటపడుతున్నారే అని ఏ రోజునా అనుకోకూడదు, ఎందుకంటే అది కోరుకొనే కదా సినిమాల్లోకి వచ్చింది అంటూ నాని చెప్పడాన్ని బాలయ్య భలేగా అభినందించారు. ఈ విషయంలో తాను తన తండ్రి యన్టీఆర్ ను, తరువాత ఏయన్నార్ ను ఫాలో అయ్యానని బాలకృష్ణ కూడా గుర్తు చేసుకున్నారు. ఓ ప్రశ్నకు సమాధానంగా “నా సక్సెస్ నాదే… నా ఫెయిల్యూర్ నాదే…” అంటూ నాని చెప్పగానే బాలయ్య “అదే నేను ఎక్స్ పెక్ట్ చేశా…” అనడం హుందాగా ఉంది. తాను ఔట్ సైడర్ నని ఎప్పుడూ ఫీల్ కాలేదని చెప్పారు నాని. అంతా ఇండస్ట్రీ, ఆడియెన్స్ ఇచ్చారని తెలిపారు. “మీరు ఏమి చేసినా, ఏం మాట్లాడినా వైరల్ అవుతుంటుంది. మీరేమనుకుంటూ ఉంటారు” అని నాని, బాలయ్యను ప్రశ్నించారు. అందుకు బాలయ్య “అర్జునుని బాణం పిట్ట కన్ను చూస్తుంది… నేను నా పనిచూసుకుంటూ వెళ్తాను” అని చెప్పడం మురిపించింది. ఇలా పలు అంశాలు భలేగా ఆకట్టుకున్నాయి. నానికి జనం నుండి కూడా ప్రశ్నలు అడిగించడం బాగుంది. నాని సమాధానాలు విన్నాక, “ఇండస్ట్రీ సాంబారు బాగా వంటపట్టింది… డిప్లొమాట్ అయ్యావు” అంటూ బాలయ్య అనడమూ అలరించింది.
బాలయ్యతో ‘గాడ్ ఫాదర్’
ఓ ప్రశ్నకు సమాధానంగా నాని, “మీతో ‘గాడ్ ఫాదర్’ లాంటి సినిమా చేస్తే బాగుంటుంది. అందులో మీరు బ్రాండో అయితే, నేను అల్ పచినో లాంటి పాత్ర పోషిస్తా” అని చెప్పారు. తండ్రీ కొడుకులే ఎందుకు? అన్నదమ్ములుగా నటిద్దామని బాలయ్య అనడం కూడా ఆకట్టుకుంది. చివరలో నాని తన కొత్త చిత్రం ‘దసరా’లోని ఓ డైలాగ్ చెప్పి, దానిని బాలయ్యతోనూ చెప్పించడం హైలైట్! ‘అన్ స్టాపబుల్’ ఆంథెమ్ కు బాలయ్యతో పాటు నాని డాన్స్ చేయడం కొసమెరుపు.
బాలయ్య సేవాగుణం
బాలయ్య, నాని మధ్య సాగిన ముచ్చట్లలో అందరినీ ఆకట్టుకున్నది – ఓ పసిపాపకు బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ద్వారా బాలయ్య స్వయంగా పూనుకొని ట్రీట్ మెంట్ ఇప్పించిన వైనం. ఆ పసిపాప తల్లి, నానికి తెలిసి ఉండడం వల్ల, వారి ఏ.వీ.ని అక్కడ ప్రదర్శించారు. అందులో ఆ పసిపాప ఇప్పుడు పెద్దపాప అయి ‘జై బాలయ్యా’అనే జెండా పట్టుకొని పరుగు తీయడం అలరించింది. ఆ పాప, వాళ్ళ అమ్మ కూడా ప్రోగ్రామ్ కు వచ్చి, బాలయ్యను కలవడం విశేషం!
భలే మార్పు
బాలకృష్ణ సినిమాల్లో పోషించే పాత్రలు, ఆయనను రిజర్బ్ గా ఉండే తీరు చూసి జనం జడుసుకుంటారు. ఆయనలో సెన్సాఫ్ హ్యూమర్ చాలా తక్కువ అనీ భావిస్తారు. కానీ, బాలయ్య ‘అన్ స్టాపబుల్’ టాక్ షో నిర్వహిస్తున్న తీరును చూస్తే, ఆయన ఎలాంటి పంచెస్ తో దంచేస్తూ వినోదం పంచుతారో అర్థమవుతోంది. అందుకే సన్నిహితులు ఆయనను ‘మా మంచి బాలయ్య’ అంటారనీ తెలిసిపోతుంది. మొదటి ఎపిసోడ్ లో బాలయ్య మాట తీరులో కాస్త ముద్దముద్దగా మాట వినిపించింది. కానీ, ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ అదరహో అనిపించారనే చెప్పాలి. ఎనీ వే, ఈ సెకండ్ ఎపిసోడ్ ‘అన్ స్టాపబుల్’లో మరింత ఎంటర్ టైన్ మెంట్ పండించింది.