తెలుగు సినిమా రంగంలో ‘భీష్మాచార్యుడు’ అనిపించుకున్నారు ప్రముఖ నిర్మాత డి.వి.యస్. రాజు. ఆయన తన అభిరుచికి తగ్గ చిత్రాలనే నిర్మిస్తూ సాగారు. యన్టీఆర్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించిన రాజు 1971లో రామారావు, జగ్గయ్యతో ‘చిన్ననాటి స్నేహితులు’ చిత్రం నిర్మించారు. ఈ సినిమాకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో శోభన్ బాబు, వాణిశ్రీ యువజంటగా అభినయించారు. ఆ చిత్రం నుంచీ శోభన్ బాబు, కె.విశ్వనాథ్ కాంబినేషన్ లో సినిమాలు తీశారు డి.వి.యస్.రాజు. విశ్వనాథ్, శోభన్ బాబు కాంబోలో డి.వి.యస్.రాజు నిర్మించిన ‘జీవనజ్యోతి’ చిత్రం సూపర్ హిట్ అయింది. 1975 టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలచింది. ఈ సినిమా తరువాత మళ్ళీ శోభన్ బాబు, విశ్వనాథ్ కలయికలో రాజు నిర్మించిన చిత్రం ‘జీవతనౌక’. ఈ సినిమా 1977 మే 13న విడుదలయింది. ఈ చిత్రానికి ముందు జయప్రదతో విశ్వనాథ్ రూపొందించిన ‘సిరిసిరిమువ్వ’ కూడా ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘జీవితనౌక’ మంచి అంచనాలతోనే జనం ముందు నిలచింది.
‘జీవితనౌక’ కథేమిటంటే – గోపి తన ఊళ్ళో అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉంటాడు. అతణ్ణి లక్ష్మి ప్రేమిస్తుంది. గోపి తాత ఓ ధనవంతురాలి ఆస్తులు చూసుకుంటూ ఉంటాడు. గోపి తాత పనిచేసే ఇంటి ఆడపిల్ల డాక్టర్ పద్మకు కూడా గోపి ఎంతగానో నచ్చుతాడు. ఆమె కూడా అతనిపై మనసు పారేసుకుంటుంది. ఎలాగైనా ప్రేమించిన లక్ష్మిని పెళ్ళాడాలను కుంటాడు గోపి. అతని తాతకు ప్రాణాపాయ స్థితి ఎదురవుతుంది. గోపి తాతను పద్మ బాగా చూసుకుంటుంది. ఆ పనిమీద పట్నం వెళ్ళిన గోపీ లేనిది చూసి, లక్ష్మికి వేరే వారితో పెళ్ళి జరిపిస్తుంటారు. లక్ష్మి ఇంట్లోంచి పారిపోతుంది. అదే సమయానికి ఊళ్ళోకి వచ్చిన గోపి, లక్ష్మి కలుసుకుంటారు. ఆమెను గుళ్ళో పెళ్ళి చేసుకుంటాడు గోపి. అయితే లక్ష్మి మైనర్ కావడం వల్ల ఆమెను మోసం చేసి గోపి పెళ్ళాడాడని కేసు పెడతాడు ఆమె తండ్రి రామలింగం. కోర్టు గోపికి సంవత్సరం శిక్ష విధిస్తుంది. లక్ష్మిని పెళ్ళాడాలనుకున్నవాడు మాత్రం ఆమెను వేధిస్తూనే ఉంటాడు. లక్ష్మి తండ్రి కూడా అతనికే ఇచ్చి పెళ్ళి చేయాలని పట్టుపడతాడు. ఆ ప్రమాదం నుండి బయట పడటానికి లక్ష్మి ఇంట్లోంచి పోతుంది. ఆమె ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురవుతుంది. లక్ష్మి చనిపోయిందని భావిస్తారు. జైలు నుండి వచ్చిన గోపికి ఈ విషయం తెలుస్తుంది. అదే సమయంలో పద్మ దగ్గరే ఉన్న తాతను తీసుకురావడానికి వెళతాడు. పద్మ, గోపిని పెళ్ళాడతానంటుంది. గోపి వద్దంటాడు. తాత చివరి కోరిక మీద పద్మను గోపి పెళ్ళాడతాడు. గోపి, పద్మ సంసారం ఆనందంగా సాగుతున్న సమయంలో లక్ష్మి వాళ్ళింటికి వస్తుంది.ట్రైన్ ప్రమాదంలో లక్ష్మి గాయపడి కళ్ళు పోయి ఉంటాయి. ఆమె పద్మ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుంది. ఆమెకు ఎలాగైనా కళ్ళు తేవాలన్నదే పద్మ తపన. కళ్ళు పోయిన తాను గోపికి భార్య కాలేననే బాధతో ఆమె ఎవరికీ చెప్పకుండా అన్నిరోజులు దూరంగా ఉండి ఉంటుంది. పద్మ ఇంటికి చేరుకున్న లక్ష్మికి నిజం తెలుస్తుంది. లక్ష్మి తన భార్య అని చెప్పకపోవడం తాను చేసిన నేరం అని పద్మకు చెబుతాడు గోపి. లక్ష్మిని ఇంకా వేధిస్తున్న వాడు ఆమె వెంట మళ్ళీ పడతాడు. వాడికి గోపి దేహశుద్ధి చేస్తాడు. చివరకు లక్ష్మి పవిత్ర ప్రేమను అర్థం చేసుకున్న పద్మ, ఆమెతోనే గోపిని ఊరికి పంపిస్తుంది. గర్భవతిగా తన వద్దకు వచ్చే లక్ష్మి కోసం ఎదురు చూస్తూంటానని చెబుతూ వారికి పద్మ వీడ్కోలు పలకడంతో కథ ముగుస్తుంది.
డి.వి.యస్. ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో శోభన్ బాబు, జయసుధ, జయప్రద, శరత్ బాబు, రాజబాబు, ముక్కామల, త్యాగరాజు, సాక్షి రంగారావు, మాస్టర్ రాము, గిరిజ, విజయభాను, రమోలా, ప్రభావతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం కె.విశ్వనాథ్ సమకూర్చగా, సముద్రాల జూనియర్ రచన చేశారు. ఈ చిత్రానికి కేవీ మహదేవన్ స్వరకల్పన చేయగా, డాక్టర్ సి.నారాయణ రెడ్డి పాటలు పలికించారు. ఈ చిత్రంలోని “గోపాలా… నందనందనుడెందో లేడు…”, “చల్లనమ్మే భామనోయి…పల్లెపట్టు లేమనోయి…”, “చిలకపచ్చని చీరలోన…”, “తుమ్మెదా తుమ్ముదా….”, “వేయి దీపాలు నాలోన వెలిగితే…అది ఏ రూపం…”, “గిలిగింతలు పలుక గలిగితే…” అంటూ సాగే పాటలు అలరించాయ.
ఈ సినిమాకు రెండు వారాల ముందే విడుదలైన ‘అడవిరాముడు’లో జయప్రద, జయసుధ నాయికలుగా నటించారు. ఆ సినిమాతోనే ఈ ఇద్దరు హీరోయిన్స్ కు స్టార్ డమ్ లభించిందని చెప్పవచ్చు. దాంతో ‘జీవితనౌక’లోనూ ‘జయ’ద్వయం నటించగానే జనం థియేటర్లకు పరుగులు తీశారు. అయితే ఆ పరుగు కేవలం ఓపెనింగ్స్ వరకే పరిమితమయింది. ఆ తరువాత దాదాపు ఇలాగే ఉండే కథతో శోభన్ బాబే హీరోగా నటించిన ‘కార్తిక దీపం’ విడుదలయింది. అందులోనూ ప్రేమించిన అమ్మాయి ప్రమాదానికి గురై కనిపించక పోతే, మరో అమ్మాయితో హీరోకు వివాహం అవుతుంది. ఆ తరువాత ఆమె వస్తుంది. చివరకు అందులో తొలుత ప్రేమించిన అమ్మాయే ఓ బాబును ప్రసవించి, కన్నుమూయడంతో ఆ సినిమా ముగుస్తుంది. ఆ కథకు కాసింత కామెడీ జోడించి అటు ఇటుగా చేసి ‘అల్లరి మొగుడు’ అనే చిత్రాన్ని మోహన్ బాబుతో రూపొందించారు. ఇలా విశ్వనాథ్ కథ తరువాత వాళ్ళకు విజయాన్ని అందించింది.