Finally Nitin vs Nikhil on Aug 12th :
ఆగస్ట్ రెండో వారంలో విడుదల కావాల్సిన సినిమాల షెడ్యూల్స్ అన్నీ తారుమారు అయిపోయాయి. ఆగస్ట్ 12న వస్తాయనుకున్న ‘యశోద’, ‘లాఠీ’ చిత్రాలను ఇప్పటికే ఆ చిత్ర నిర్మాతలు వాయిదా వేస్తూ ప్రకటన చేశారు. ఇక బరిలో ఐదు సినిమాలు ఉంటాయని అంతా భావించారు. ఆగస్ట్ 11న ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ను ఐదు భాషల్లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీ తెలుగు వర్షన్ కు చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం ఓ విశేషం. చిరంజీవి ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి తెలుగు వర్షన్ ప్రచారం ఊపందుకుంది. ఇక అదే రోజు వస్తుందని అనుకున్న విక్రమ్ ‘కోబ్రా’ విడుదల వాయిదా పడిందని అంటున్నారు. ఇందులో ఏకంగా 20 రకాల గెటప్స్ లో చియాన్ విక్రమ్ కనిపించబోతున్నాడు. ‘కోబ్రా’ సినిమా తొలి కాపీ రావడానికి మరింత సమయం పట్టేట్టు ఉండటంతో దీన్ని ముందు అనుకున్నట్టు ఆగస్ట్ 11న రిలీజ్ చేయడం లేదన్నది కోలీవుడ్ తాజా సమాచారం. అలానే అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’ కూడా వాయిదా పడినట్టే అని అంటున్నారు. సో… ముందుగా ప్రకటించినట్టు ఆగస్ట్ 12న నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ రావడం ఖాయం. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా నిదానంగా ఊపందుకుంటున్నాయి. అలానే బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమౌతున్న ‘స్వాతిముత్యం’ మూవీ ఆగస్ట్ 13న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే… ఈ నెల 22న విడుదల కావాల్సిన నిఖిల్ పాన్ ఇండియా మూవీ ‘కార్తికేయ -2’ను వాయిదా వేశామని దర్శక నిర్మాతలు ఇప్పటికే తెలిపారు. ఈ సినిమా ఆగస్ట్ మొదటి వారంలో వస్తుందని ఆ మధ్య నిఖిల్ ప్రకటించాడు. అయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో కాకుండా ఇది సెకండ్ వీక్ లో అంటే ఆగస్ట్ 12న విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. ‘కోబ్రా’, ‘ఏజెంట్’ సినిమాల వాయిదా కారణంగా థియేటర్లు బాగానే లభించే అవకాశం ఉందని, అందువల్ల ‘కార్తికేయ -2’ను 12వ తేదీ రిలీజ్ చేస్తే బాగుంటుందని నిర్మాతలు విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ భావించారట. సో… ఆ రోజున యంగ్ హీరోస్ నితిన్ అండ్ నిఖిల్ బాక్సాఫీస్ బరిలో పోరుకు దిగబోతున్నారు!!