గురువేమో నవ్వు నాలుగు వందల విధాల గ్రేటు అన్నారు. శిష్యుడేమో ఆ సూత్రాన్ని పట్టుకొని నలుదిశలా నవ్వుల పువ్వులు పూయించారు. ఆ గురువు ఎవరంటే ‘నవ్వడం భోగం… నవ్వించడం యోగం… నవ్వకపోవడం రోగం…’ అని చాటిన జంధ్యాల. ఇక ఆ శిష్యుడు ‘నవ్వేందుకే ఈ జీవితం’ అన్నట్టుగా సాగిన ఇ.వి.వి సత్యనారాయణ.
తొలి చిత్రం ‘చెవిలో పువ్వు’ మొదలు చివరి దాకా ఏ సినిమా తీసినా, వాటిలో నవ్వులకే పెద్ద పీట వేశారు ఇ.వి.వి. అందుకే ఆయన సినిమాలు ఇప్పుడు చూసినా కితకితలకు గురికాకుండా ఉండలేము.
ఇ.వి.వి. పూర్తి పేరు ఈదర వీరవెంకట సత్యనారాయణ. 1956 జూన్ 10న పశ్చిమ గోదావరి జిల్లా కోరుమామిడి గ్రామంలో ఇ.వి.వి. జన్మించారు. చిన్నప్పటి నుంచీ రామారావు, నాగేశ్వరరావు చిత్రాలు చూసి, సినిమాలపై వ్యామోహం పెంచుకున్నారు. దాంతో చదువు సరిగా సాగలేదు. అయితేనేం, సినిమా కథలు రాసేసుకొనేవారు. మిత్రుల ప్రోత్సాహంతో మద్రాసు చేరి, తొలుత ప్రముఖ నిర్మాత నవతా కృష్ణంరాజును కలిశారు. ఆయన చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అలా నటదర్శకుడు దేవదాస్ కనకాల వద్ద మొదట అసిస్టెంట్ గా ‘నాగమల్లి, ఓ ఇంటి భాగోతం’ చిత్రాలకు పనిచేశారాయన. తరువాత జంథ్యాల దగ్గర అసిస్టెంట్ గా చేరి, దాదాపు 20 సినిమాలకు అసోసియేట్ గా ఉన్నారు.
ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకుడు కావాలన్న అభిలాషతో పలువురు నిర్మాతలను కలిశారు. ఆయన కథలు విన్నవారు, నవ్వుకున్నవారు, నవ్వేసి ఊరకున్నవారూ ఇలా ఎంతోమంది ఉన్నారు. అయితే సత్యంలో ఏదో ఉందని గుర్తించినది నటనిర్మాత అశోక్ కుమార్. డి.రామానాయుడు మేనల్లుడైన అశోక్ కుమార్, ఇ.వి.వి.ని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘చెవిలో పువ్వు’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విజయాన్ని సాధించలేకపోయింది. అలాంటి సమయంలో ఇ.వి.వి.ని ప్రోత్సహించింది రామానాయుడే. అలా రామానాయుడు కాంపౌండ్ చేరిన ఇ.వి.వి. ‘ప్రేమఖైదీ’ని రూపొందించారు. ఈ సారి గురి తప్పలేదు. ‘ప్రేమఖైదీ’ మంచి విజయం సాధించింది. ఇక ఇ.వి.వి. వెనుతిరిగిచూసుకోలేదు.
ఇ.వి.వి. సత్యనారాయణ గురువు జంధ్యాల లాగే నవ్వునే నమ్ముకొని ముందుకు సాగారు. రాజేంద్రప్రసాద్ హీరోగా “అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు, ఆలీబాబా అరడజన్ దొంగలు” వంటి చిత్రాలు రూపొందించి, ప్రేక్షకుల పొట్టలు చెక్కలు చేశారు. ఇక నరేశ్ తో ఇ.వి.వి. తెరకెక్కించిన ‘జంబలకిడి పంబ’ పూయించిన నవ్వులను ఎవరు మాత్రం మరచిపోగలరు. శ్రీకాంత్, హరీశ్, వినోద్ కుమార్ వంటి వర్ధమాన కథానాయకులకు ఇ.వి.వి. చిత్రాలే పేరు సంపాదించి పెట్టాయి. ఓ వైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు ‘ఆమె’ వంటి ఆలోచింప చేసే చిత్రాన్నీ రూపొందించారు. చిరంజీవితో ‘అల్లుడా మజాకా’, నాగార్జునతో ‘వారసుడు, హలో బ్రదర్’ , వెంకటేశ్ తో ‘అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు -వంటింట్లో ప్రియురాలు’, బాలకృష్ణతో ‘గొప్పింటి అల్లుడు’ వంటి చిత్రాలను రూపొందించి ఆకట్టుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’ ని తెరకెక్కించిందీ ఇ.వి.వి.నే! అలా సక్సెస్ రూటులో భలేగా సాగిపోయారు ఇ.వి.వి. తానే నిర్మాతగా మారి, ఇ.వి.వి. సినిమా పతాకంపై తొలి ప్రయత్నంగా ‘చాలాబాగుంది’ తీశారు. తరువాత మరికొన్ని చిత్రాలు ఈ బ్యానర్ పైనే రూపొందించారు. హిందీలో ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిత్రం ‘సూర్యవంశం’. అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని పద్మాలయా సంస్థ నిర్మించింది.
ఇ.వి.వి. సత్యనారాయణ కుమారులు రాజేశ్, నరేశ్ ఇద్దరూ నటనలో అలరించారు. తనయులిద్దరినీ హీరోలుగా పెట్టి ‘నువ్వంటే నాకిష్టం’ తీశారు. ‘అల్లరి’ నరేశ్ తో కొన్ని నవ్వుల నావలు నడిపారు ఇ.వి.వి. చివరలో “కత్తి కాంతారావు, బురిడి” వంటి చిత్రాలు తెరకెక్కించారు. అవీ అంతగా అలరించలేదు. ఏది ఏమైనా ఇ.వి.వి. సత్యనారాయణ పేరు వినగానే ఆయన పండించిన నవ్వుల పువ్వులు ముందుగా గుర్తుకు వస్తాయి. తెలుగు సినిమా తెరపై చెరిగిపోని నవ్వుల సంతకం చేసిన వారిలో ఇ.వి.వి. పేరు కూడా ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది.