చట్టసభల్లో శిష్టభాషనే మాట్లాడాలని, అలా కాకుండా అశిష్ట పదాలు (Unparliamentary Words) మాట్లాడితే వాటిని రికార్డుల నుండి తొలగించాలని ఏ నాడో ఓ నిబంధన రూపొందించారు. మరి ఏవి అశిష్ట పదాలు అన్న అంశంపై పార్లమెంట్ లో 1954లోనే ఓ నిఘంటువు రూపొందించారు. అందులో పేర్కొన్న పదాలను ‘అన్ పార్లమెంటరీ వర్డ్స్’గా నిర్ణయించారు. ఆ పదాలను సభ్యులు (లోక్ సభ వారయినా, రాజ్యసభ వారయినా, రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యులైనా) మాట్లాడరాదని అలా మాట్లాడినట్లయితే వాటిని రికార్డుల నుండి తొలగిస్తారు. ఈ పదాల పట్టికను 1986, 1992, 1999, 2004, 2009, 2010 ఇలా విడుదల చేస్తూ వచ్చారు. 2009 తరువాత నుంచీ ప్రతి యేడాది అశిష్ట పదాల నిఘంటువును విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు విడుదల చేసిన బుక్ లెట్ లో “శకుని, జుమ్లాజీవి, బాల్ బుద్ధి, కోవిడ్ స్ప్రెడర్, స్నూప్ గేట్” వంటి పదాలను ఇకపై చట్టసభల్లో ఉపయోగించరాదని తీర్మానించింది ప్రభుత్వం. ఈ బుక్ లెట్ లో “బ్లడీ, అషేమ్డ్, చీటెడ్, చెంచా, చెంచాగిరి, అసత్య, అప్మాన్, గద్దర్, అసత్య, అహంకార్” వంటి పదాలనూ నిషిద్ధభాషలో చేర్చారు. దీనిపై ప్రతిపక్షాలు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఏకీభవించలేదు. రచ్చ సాగింది. అంతా బాగానే ఉంది. చట్టసభల్లోనే ఇలాంటి తరచూ ఉపయోగించే పదాలను తొలగిస్తే, వినోదం కోసమని సినిమాల్లో మరింత నీచమైన పదాలను ఉపయోగిస్తున్నారు. వాటి మాటేమిటి?
‘ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్’ (సి.బి.ఎఫ్.సి) కూడా సమాచార, ప్రసార శాఖ కిందకే వస్తుంది. కాబట్టి, చట్టసభల్లో అశిష్ట భాషగా నిర్ణయించిన పదాలను సినిమాల్లోనూ తొలగిస్తారా? ఒకప్పటి సెన్సార్ నిబంధనలతో పోల్చి చూస్తే, ప్రస్తుతం ఎంతో సరళంగా నియమనిబంధనలు ఉన్నాయి. ఆ రోజుల్లో “ఏం చేస్తున్నావ్?” అని ఓ పురుష పాత్ర భార్యను ప్రశ్నిస్తే, “చీర మార్చుకుంటున్నాను” అని స్త్రీ పాత్ర సమాధానం ఇవ్వడంలో అశ్లీలం కనిపిస్తోందని సదరు మాటలను తొలగించిన సందర్భం ఉంది. అలాగే పాటల్లోనూ కొన్ని పదాలు ప్రేక్షకులపై చెడు ప్రభావం చూపించేలా ఉన్నాయంటూ, ‘దాగుడుమూతలు’లోని “అడగక ఇచ్చిన మనసే ముద్దు…” అనే పాటలో చివరలో వినిపించే “నువ్వు నేను ముద్దుకు ముద్దు…” అనే వాక్యాన్ని తొలగించారు. దాని బదులు ఊరకే హమ్మింగ్ చేసినట్టూ చూపించారు. ఇక ‘దొరబాబు’లోని “రా రా పడకింటికి…” అన్న పాటలో ‘పడకింటికి…’ అన్న మాట తప్పుగా ఉందని దానిని “మా ఇంటికి…” అని మార్చారు. అలాగే ‘యుగపురుషుడు’లోని “ఎక్కు ఎక్కు తెల్లగుర్రం…” పాట బూతు ధ్వనిస్తోందని దానిని “ఎంత వింత లేతవయసు…” అని మార్పు చేశారు. ఇలా ఆ రోజుల్లో సన్నివేశాల్లోనూ, పాటల్లోనూ కాసింత అసభ్యత, అశ్లీలం ధ్వనించినా తొలగించేవారు. మరి ఇప్పుడో ‘సహజత్వం’ అనే మాటున చుట్టూ ఉన్న పాత్రలే కాదు, నాయికానాయకులు సైతం “కొడకా…”, “లమ్డీకే…” అంటూ బూతులూ వాడేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలోనూ ఆలోచిస్తే, ఎటూ సెన్సార్ బోర్డ్ సమాచార, ప్రసార శాఖకు లోబడే పనిచేయాలి కాబట్టి సినిమాల్లోనూ అసభ్య పదాలను తొలగించడం మొదలు పెడితే సభ్యసమాజానికి మేలు.