World Oldest Married Couple: ప్రేమ గుడ్డిది, ప్రేమకు వయసుతో సంబంధం లేదు, ప్రేమ కులం – మతం అంటూ చూడదు.. ఇలా అనేక కొటేషన్స్ మనం తరచూ వింటూనే ఉంటాము. అయితే, వీటిని సీరియస్ గా తీసుకున్నట్టున్నారు ఓ వృద్ధ జంట. అవునండి బాబు.. ఏకంగా 100 ఏళ్ళు దాటిన ఇరువురు కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఏంటి 100 ఏళ్ళు నిండిన వారు కొత్త జీవితం ప్రారంభించడమేంటి అని ఆలోచిస్తున్నారా..? అవును నిజమే.. మీరు అనుకున్నది. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు.. ఇంట్లో వారిని ఒప్పించి చివరికి పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
అమెరికాలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 102 ఏళ్ల బామ్మ.. 100 ఏళ్ల వృద్ధుడు వివాహ బంధంతో ఒక్కటై.. ప్రపంచంలో ఇప్పటి వరకు పెళ్లిచేసుకున్న అత్యంత వృద్ధ జంటగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించారు. డిసెంబర్ 3న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వీరి వివాహాన్ని గుర్తించి వారికీ రికార్డును కూడా అందజేసింది. బెర్నీ లిట్టర్‌మాన్, మార్జోరీ ఫుటర్‌మాన్‌ల ప్రేమ దాదాపు పది సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఇది ఫిలడెల్ఫియాలో జరిగిన కాస్ట్యూమ్ పార్టీ సందర్భంగా ప్రారంభమైంది. సీనియర్ లివింగ్ కమ్యూనిటీలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఈ ఏడాది మే 19న తమ ప్రేమను చాటుకున్నారు. బెర్నీ, మార్జోరీ గతంలో 60 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని తమ భాగస్వాములతో గడిపారు. ఆ తరువాత వారి భాగస్వాములు మరణించారు. దానితో ఈ వ్యక్తులు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.
ఇక్కడ మరో విశేషమేమిటంటే.. వీరిద్దరూ ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారు. బెర్నీ యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చదివిన తర్వాత ఇంజనీరింగ్ చేసాడు. మార్జోరీ టీచింగ్ వృత్తిని ఎంచుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ శతాధిక వృద్ధ జంట వివాహానికి వారి నాలుగు తరాల కుటుంబ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు.