హిందీ చిత్రాలతోనూ వెలుగు చూసిన తెలుగు దర్శకులు ఎందరో ఉన్నారు. వారిలో తాతినేని రామారావు ప్రత్యేక స్థానం సంపాదించారు. మాతృభాష తెలుగులో విజయాలు సాధించిన తాతినేని రామారావు, దక్షిణాదిన సక్సెస్ చూసిన అనేక చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. అక్కడా జయకేతనం ఎగురవేశారు. తాతినేని రామారావు ఎన్ని సినిమాలు తీసినా, ఆయన పేరు వినగానే ‘యమగోల’ డైరెక్టర్ అనేవారు ఉన్నారు. ఆ సినిమాతో తాతినేని రామారావు పేరు మారుమోగి పోయింది. అందుకే ఇప్పటికీ ‘యమగోల’ తాతినేని రామారావుగానే ఆయన నిలిచారు.
తాతినేని రామారావు 1938 నవంబర్ 10న కృష్ణాజిల్లా కపిలేశ్వరంలో జన్మించారు. ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావు ఆయనకు సమీప బంధువు. దాంతో రామారావు కూడా సినిమా రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. వెళ్ళి తాతినేని ప్రకాశరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించిన ‘ఇల్లరికం’ ఘనవిజయం సాధించింది. ఆ చిత్రానికి కె.ప్రత్యగాత్మ అసోసియేట్ గా పనిచేశారు. ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొందిన కొన్ని చిత్రాలకు తాతినేని రామారావు అసోసియేట్ గా ఉన్నారు. ప్రత్యగాత్మతో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన ‘కులగోత్రాలు’ చిత్రానికి తాతినేని రామారావు పనిచేయడం వల్ల, ఆ చిత్ర నిర్మాత ఏ.వి.సుబ్బారావు, ఈయనను ప్రోత్సహించారు. తమిళంలో శివాజీగణేశన్, సావిత్రి జంటగా రూపొందిన ‘నవరాత్రి’ మంచి విజయం సాధించింది. ఆ సినిమా శివాజీగణేశన్ నూరవ చిత్రం. అందువల్ల తమిళంలో విశేషాదరణ చూరగొంది. అదే చిత్రాన్ని తెలుగులో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ‘నవరాత్రి’ టైటిల్ తోనే రీమేక్ చేశారు. సావిత్రి తన పాత్రలో తానే నటించగా, ఇక్కడ ఏయన్నార్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో విశేషమేమంటే, కథానాయకుణ్ణి పోలిన వారు మరో ఎనిమిది మంది ఉంటారు. అంటే మొత్తం తొమ్మిది పాత్రలన్న మాట. తమిళంలో శివాజీ తొమ్మిది పాత్రల్లో అలరించారు. తెలుగులో ఆ పాత్రలకు కొన్ని మార్పులూ చేర్పులూ చేసి తాతినేని రామారావు దర్శకత్వంలో ‘నవరాత్రి’ నిర్మించారు ఏ.వి.సుబ్బారావు. అలా ‘నవరాత్రి’ రీమేక్ తో తాతినేని రామారావు దర్శకుడయ్యారు.
‘నవరాత్రి’ తెలుగులో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దాంతో రెండో అవకాశం కూడా ఏ.వి.సుబ్బారావు కల్పించారు. అది కూడా ఏయన్నార్ హీరోగా రూపొందిన ‘బ్రహ్మచారి’ చిత్రం. ఈ సినిమా జనాదరణ చూరగొంది. కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా ‘మంచి మిత్రులు’ తెరకెక్కించారు తాతినేని రామారావు. ఫరవాలేదనిపించింది. ఏయన్నార్ తో తెరకెక్కించిన ‘సుపుత్రుడు’ అంతగా ఆకట్టుకోలేక పోయింది. తరువాత ఏయన్నార్, కాంచనతో రూపొందించిన ‘రైతు కుటుంబం’ భలేగా మెప్పించింది. అయినప్పటికీ తాతినేని రామారావు కోరుకున్న బంపర్ హిట్ తగల్లేదు. ఆ సమయంలో సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడు నవలా చిత్రంగా ‘జీవనతరంగాలు’ను తాతినేని రామారావు దర్శకత్వంలో నిర్మించారు. ఆ చిత్రం రజతోత్సవం చూసింది. దాంతో తాతినేని రామారావుకు మంచి పేరు లభించింది.
ఏయన్నార్ తో ‘దొరబాబు, ఆలుమగలు’ తీశారు. వాటిలో ‘ఆలుమగలు’ సూపర్ హిట్ అయింది. శోభన్ బాబుతో ‘రాజువెడలె’, కమల్ హాసన్ తో ‘అమరప్రేమ’ రూపొందించారు. అన్నిటినీ మించి 1977లో అక్టోబర్ 21న యన్టీఆర్ హీరోగా తాతినేని రామారావు దర్శకత్వంలో ‘యమగోల’ చిత్రం విడుదలై విజయఢంకా మోగించింది. తాతినేని రామారావు కెరీర్ లోనే బిగ్ హిట్ గా ‘యమగోల’ నిలచింది. ఈ చిత్రాన్ని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.వెంకటరత్నం నిర్మించారు. రూపాయికి నాలుగు రూపాయలు లాభం చూసిందని నిర్మాత స్వయంగా చెప్పుకున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో ‘లోక్-పరలోక్’గా తాతినేని రామారావు దర్శకత్వంలోనే వెంకటరత్నం నిర్మించారు. జితేంద్ర , జయప్రద జంటగా నటించిన ఈ హిందీ చిత్రం జనాన్ని ఆకట్టుకుంది. ఆ తరువాత నుంచీ హిందీలోనూ తాతినేని రామారావుకు అవకాశాలు లభించసాగాయి.
తన దర్శకత్వంలోనే రూపొంది విజయం సాధించిన ‘ఆలుమగలు’ను హిందీలో ‘జుదాయి’ పేరుతో తెరకెక్కించారు తాతినేని రామారావు. ‘కార్తిక దీపం’ను హిందీలో ‘మాంగ్ భరో సజనా’గానూ, ‘అంతులేని కథ’ను ‘జీవన్ ధార’గానూ, ‘సట్టమ్ ఎన్ కయిల్’ను హిందీలో ‘యే తో కమాల్ హోగయా’గానూ రీమేక్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విజయం సాధించిన ‘చట్టానికి కళ్ళులేవు’ చిత్రాన్ని హిందీలో అమితాబ్, రజనీకాంత్ తో ‘అంధాకానూన్’గా రీమేక్ చేసి, మంచి విజయం సాధించారు. అలాగే తెలుగులో విజయం సాధించిన ‘ముగ్గురు మిత్రులు’ను ‘దోస్తీ దుష్మనీ’గా, ‘మయూరి’ని ‘నాచే మయూరి’గా, ‘సంసారం ఒక చదరంగం’ను ‘సంసార్’గా, ‘పెదరాయుడు’ను ‘బులందీ’గా హిందీలో రీమేక్ చేసి ఆకట్టుకున్నారు తాతినేని రామారావు. అమితాబ్ బచ్చన్ తో “ఇంక్విలాబ్, ఆఖ్రీ రాస్తా” చిత్రాలు రూపొందించారు.
దక్షిణాదిన విజయం సాధించిన చిత్రాలను హిందీలో రీమేక్ చేయడంలో మేటి అనిపించుకున్న తాతినేని రామారావు, అక్కడ సక్సెస్ సాధించిన సినిమాలను ఇక్కడ పునర్నిర్మించి కూడా ఆకట్టుకున్నారు. హిందీలో విజయం సాధించిన ‘ఆశా’ను తెలుగులో యన్టీఆర్ హీరోగా ‘అనురాగదేవత’ రూపొందించారు. ఈ చిత్రం ద్వారానే పరుచూరి బ్రదర్స్ పరిచయం కావడం విశేషం. శోభన్ బాబుతో తెరకెక్కించిన ‘ఇల్లాలు’, కృష్ణతో రూపొందించిన ‘పచ్చని సంసారం’ కూడా హిందీ నుండి రూపొందిన రీమేక్స్ కావడం విశేషం.
తాతినేని రామారావు దర్శకత్వంలో ఏయన్నార్ ఎక్కువ చిత్రాలలో హీరోగా నటించారు. వీరి కాంబోలో వచ్చిన ‘శ్రీరామరక్ష’ కూడా ఆకట్టుకుంది. యన్టీఆర్ తో తాతినేని రామారావు రూపొందించిన మూడు చిత్రాలు ‘యమగోల, ఆటగాడు, అనురాగదేవత’ శతదినోత్సవాలు చూడడం విశేషం. ఇక తాతినేని రామారావును దర్శకునిగా పరిచయం చేసిన ఏ.వి.సుబ్బారావు బాలకృష్ణ హీరోగా “ప్రెసిడెంట్ గారి అబ్బాయి, తల్లిదండ్రులు” చిత్రాలు నిర్మించారు. ఈ రెండు చిత్రాలు కూడా తాతినేని రామారావు దర్శకత్వంలోనే తెరకెక్కి విజయం సాధించాయి. మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల ‘వెడ్డింగ్ బెల్స్’ ఆధారంగా ఏ.వి.సుబ్బారావు నిర్మించిన ‘గోల్ మాల్ గోవిందం’కు కూడా తాతినేని రామారావు దర్శకుడు. 2000లో గోవింద హీరోగా రూపొందిన ‘బేటీ నంబర్ వన్’ రామారావు చివరి చిత్రం. 83 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న రామారావు మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.