Anil Ravipudi Birthday Special: నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొని సాగుతున్నారు అనిల్ రావిపూడి. చూడగానే బాగా తెలిసిన కుర్రాడిలా కనిపిస్తారు. అతనిలో అంత విషయం ఉందని ఒహ పట్టానా నమ్మబుద్ధి కాదు. కానీ, అనిల్ రావిపూడి తీసిన వినోదాల విందుల గురించి తెలియగానే ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. ‘పటాస్’లో ఆయన పంచిన పకపకలు, ‘సుప్రీమ్’లో అనిల్ పెట్టిన కితకితలు, ‘రాజా ది గ్రేట్’లో గిలిగింతల చిందులు జనం మరచిపోలేక పోతున్నారు. ఆ తరువాత వచ్చిన అనిల్ రావిపూడి చిత్రాల్లోనూ అదే తంతు. పొట్టలు చేత పట్టుకొని నవ్వడమే ప్రేక్షకుల వంతయింది.
అనిల్ రావిపూడి 1982 నవంబర్ 23న జన్మించారు. వారి స్వస్థలం ప్రకాశం జిల్లాలోని యద్దనపూడి మండలం చిలుకూరి వారిపాలెం. ఆయన తండ్రి బ్రహ్మయ్య ఆర్టీసీ డ్రైవర్. ఆయన తండ్రి ఎంతో కష్టపడి అనిల్ ను బి.టెక్. చదివించారు. చదువంటే ఎంతో ఇష్టంగా ఉండే అనిల్ మనసును బాల్యంలోనే సినిమాలు గిల్లాయి. దాంతో స్కూల్ లోనూ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్స్, కల్చరల్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొనేవారు అనిల్. అయితే తండ్రి కష్టపడి చదివిస్తూ ఉండడంతో ఏ నాడూ చదువును అశ్రద్ధ చేయలేదు. ముందుగా బి.టెక్, పూర్తి చేశాకే సినిమాలపై ఆసక్తితో చిత్రసీమలో అడుగు పెట్టారు అనిల్. ఆయనకు ప్రముఖ దర్శకుడు పి.అరుణ్ ప్రసాద్ బాబాయ్ అవుతారు. అలా ఆయనను నమ్ముకొని చిత్రసీమలో అడుగు పెట్టారు అనిల్. 2005లో హైదరాబాద్ లో అడుగుపెట్టిన అనిల్ తొలుత అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘గౌతమ్ ఎస్.ఎస్.సి.’కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత కెమెరామేన్ శివ ద్వారా వి.ఎన్.ఆదిత్య పరిచయమయ్యారు. నాగార్జున ‘బాస్’ సినిమాకు ఆదిత్య దగ్గర పనిచేశారు అనిల్. ఆ సినిమాకు శివనే సినిమాటోగ్రాఫర్. ఆ సమయంలోనే అప్పుడప్పుడు రచనలో చేయి చేసుకొనేవారు. ఆ తరువాత ‘శౌర్యం’ సినిమాతో సినిమాటోగ్రాఫర్ శివ కాస్తా దర్శకునిగామారారు. ఆ సినిమాకు అనిల్ తోనే రచన చేయించారు. ఆ తరువాత “శంఖం, కందిరీగ, మసాల, ఆగడు, సుడిగాడు” వంటి చిత్రాలకు రచనచేస్తూ సాగారు. తనకు రచనలో జంధ్యాల గారు ఆదర్శమంటారు అనిల్. కళ్యాణ్ రామ్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనిల్ ‘పటాస్’తో డైరెక్టర్ అయ్యారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తరువాత వరుసగా ‘సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్-2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ -3″ చిత్రాలతో జనానికి కితకితలు పెడుతూనే నిర్మాతల ఇంట వసూళ్ళ వర్షం కురిసేలా చేశారు అనిల్.
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని విశేషంగా వినిపిస్తోంది. అంతేకాదు, బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞను పరిచయంచేసే చిత్రానికీ అనిల్ దర్శకత్వం వహిస్తారనీ వినిపించింది. “నేను కథలు ఎప్పుడూ ‘యూనివర్సల్ పాయింట్’తోనే రాస్తాను. స్టార్స్ తో సినిమాలు తీయాల్సి వస్తే మాత్రం తప్పకుండా వారి ఇమేజ్ ను కూడా దృష్టిలో పెట్టుకొని రాసుకుంటాను. అందరినీ ఆకట్టుకొనే కథలను రాసుకోగలననే నమ్మకం నాకుంది. అదే నా బలంగా భావిస్తాను” అంటున్నారు అనిల్ రావిపూడి. నవంబర్ 23న అనిల్ పుట్టినరోజు. వచ్చే పుట్టినరోజు కల్లా అనిల్ మరికొన్ని జనరంజకమైన చిత్రాలతో అలరిస్తారని ఆశిద్దాం.