సమాజ హితం కోసమంటూ ప్రముఖ బాలీవుడ్ నటి జుహీ చావ్లా చేసిన ఓ న్యాయ పోరాటం ఆమెను ఊహించని విధంగా చిక్కుల్లో పడేసింది. 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా జుహీచావ్లా కొంతమందితో కలిసి ఢిల్లీ హైకోర్టులో ఆ మధ్య పిటీషన్ వేసింది. 5 జీ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదం ఉందని, పౌరులకు ఎలాంటి హానీ జరగదని ప్రభుత్వం ధృవీకరించే వరకూ ఆ టెక్నాలజీని ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని ఆ పిటీషన్ లో ఆమె కోరింది. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కేంద్రం… హైకోర్టుకు విన్నవించింది. శుక్రవారం దీనికి సంబంధించిన విచారణ జరిగింది. టెక్నాలసీని అప్ గ్రేడ్ చేయాల్సిందేనని కోర్ట్ అభిప్రాయపడింది. జుహీ చావ్లా తదితరులు వేసిన వాజ్యాన్ని తిరస్కరించింది. అంతేకాదు… ఈ టెక్నాలజీపై ఏమైనా సందేహాలు ఉంటే ముందు ప్రభుత్వానికి లేఖ రాసి ఉండాల్సిందని కోర్టు తెలిపింది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ అసలు ట్విస్ట్ అప్పుడే జరిగింది. ఈ వాదనలు జరుగుతున్న సమయంలో జూహీచావ్లా అభిమాని ఒకరు సినిమా పాటలు వినిపించడంతో పాటు, కోర్ట్ ప్రొసీడింగ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఢిల్లీ హైకోర్ట్ సీరియస్ అయ్యింది. నటికి ఇరవై లక్షల జరిమానా విధించింది. మొత్తానికీ ఓ అభిమాని చేసిన ఆకతాయి పని వల్ల జూహీ చావ్లా ఇమేజ్ కు బాగానే డ్యామేజ్ అయ్యింది.