ఈ భూ ప్రపంచంలో ప్రతి జీవికి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య నుండి బయట పడటానికి వారి ముందు ఉండేవి మూడే దారులు. అవి పారిపోవడం, దాక్కోవడం లేదా ఎదురు తిరగడం! దారి ఏదైనా గమ్యం మాత్రం ఒక్కటే. అలా ఐదుగురు వ్యక్తులకు వేర్వేరు సందర్భాలలో ఎదురైన ఒకే సమస్యను ఇతివృత్తంగా తీసుకొని ప్రతి సన్నివేశంలో ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా ‘దారి’ పేరుతో ఓ చిత్రం రూపొందించారు దర్శకుడు యు. సుహాస్ బాబు.
ఫిఫ్త్ హౌస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నరేష్ మామిళ్ళ, మోహన్ ముత్తిరయిల్ ఈ ‘దారి’ సినిమాను నిర్మిస్తున్నారు. పరమేశ్వర్ హివ్రాలే, కళ్యాణ్ విట్టపు, సునీత సద్గురు, సాయి తేజ గోనుగుంట్ల, అభిరామ్ (క్రేజీ అభి) ప్రధానపాత్రలు పోషించిన ఈ సినిమా థీమ్ పోస్టర్ ను సోమవారం విడుదల చేశారు. ‘ముందెన్నడూ చూడని స్టోరీ లైన్ ఎంచుకొని అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఈ కథ రాసుకొన్నానని, ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ కాపీ తో సెన్సార్ కి సిద్దంగా ఉందని దర్శకుడు సుహాస్ బాబు తెలిపారు.