సాప్ట్ వేర్ ఇంజనీర్ నుంచి నటుడుగా మారిన రఘు కారుమంచి ఇప్పుడు మరో బిజినెస్ లోకి ఎంటరయ్యాడు. 2002లో ‘ఆది’తో నటుడు అయిన రఘు ఆ తర్వాత పలు చిత్రాలలో హాస్య పాత్రలతో అలరించటమే కాదు జబర్ దస్త్ షోలో రోలర్ రఘుగా టీమ్ లీడ్ చేశాడు. కరోనా టైమ్ లో ఫార్మింగ్ మీద దృష్టి పెట్టి సమర్థవంతంగా వ్యవసాయం చేస్తూ వచ్చాడు రఘు కారుమంచి. ఇప్పుడు అనుకోకుండా మిత్రులతో కలసి మద్యం వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. కరోనా తన ఆలోచన దృక్పథాన్ని మార్చిందన్న రఘు లాక్ డౌన్ పిరియడ్ లో ప్రత్యామ్నాయ వృత్తి గురించి ఆలోచించి మళ్ళీ సాఫ్ట్ వేర్ సైడ్ వెళ్ళాలనే ఆలోచన కూడా చేశాడట.
అయితే ముందుగా పెరట్లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆ తర్వాత హైదరాబాద్ నగర శివార్లలో పదెకరాల వ్యవసాయ భూమి కౌలుకు తీసుకుని సాగ చేస్తున్నాడు. ఇటీవల మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్న అతని సన్నిహితులు సాయిరాంరెడ్డి, హరినాథ్ రఘును సంప్రదించటంతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మద్యం దుకాణాల వేలంలో పాల్గొని రెండు షాపులను దక్కించుకున్నారు. నల్గొండ సరిహద్దుల్లో మర్రిగూడ బైపాస్ వద్ద అభినవ్ లిక్కర్స్ పేరుతో రఘు, అతని స్నేహితులు మద్యం దుకాణంను ఏర్పాటు చేశారు. బుధవారం ఈ లిక్కర్ షాప్ ను ఆరంభించారు. రఘు తన మద్యం దుకాణంలో ఉన్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరి కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టిన రఘు కారుమంచి ఈ వ్యాపారంలో విజయం సాధించాలని కోరుకుందాం.