తెలుగు ప్రేక్షకులకు వైవిధ్యమైన కథలను అందించాలనే తపన యశ్ రంగినేనిలో స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘పెళ్లి చూపులు’ చిత్రంతో నిర్మాతగా ఆయన ప్రస్థానం ఘనంగా మొదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాక, జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుని తెలుగు సినిమా సత్తాను చాటింది. ఆ తర్వాత కూడా ఆయన రొటీన్ ఫార్ములాకు వెళ్లకుండా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే వంటి విభిన్న చిత్రాలను నిర్మించి తన అభిరుచిని చాటుకున్నారు.
Also Read: Putin: పుతిన్ ఇంటిపై దాడి చేసిన ఉక్రెయిన్ డ్రోన్ వీడియో రిలీజ్..
నిర్మాతగా రాణిస్తూనే, తనలోని నటుడిని కూడా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు యశ్ రంగినేని. తాజాగా రోషన్ మేక హీరోగా, జాతీయ అవార్డ్ గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో విడుదలైన ‘ఛాంపియన్’ చిత్రంలో ఆయన పోషించిన పాత్ర ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాలో ‘వీరయ్య’ అనే పాత్రలో యశ్ రంగినేని అద్భుతంగా నటించారు. బడుగు, బలహీన వర్గాల ప్రతినిధిగా, ఒక అమాయకపు చదువురాని గ్రామీణ వ్యక్తిగా ఆయన కనిపించిన తీరు ప్రశంసనీయం. మాటల కంటే భావాలకే ప్రాధాన్యత ఉన్న ఈ పాత్రలో, కళ్ళతోనే ఎన్నో ఎమోషన్లను పండించారు. లోలోపల అగ్ని పర్వతంలా రగిలే ఆవేశాన్ని, అణగారిన వర్గాల ఆవేదనను తన నటనతో పలికించారు. ఇందులో వీరయ్య పాత్ర ప్రేక్షకులకు సుదీర్ఘకాలం గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు.