Tollywood : టాలీవుడ్‌లో వేతనాల పెంపుపై ఉత్కంఠ పెరిగింది. ఫెడరేషన్ రేపటి నుంచి 30% వేతనాలు పెంచితేనే షూటింగ్లకు హాజరవుతామని, లేనిపక్షంలో బంద్ ప్రారంభిస్తామని ప్రకటించిన నేపథ్యంలో తెలుగు ఫిలిం చాంబర్ నుండి అధికారిక ప్రతిస్పందన వచ్చింది. చాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ ఒక లేఖ విడుదల చేసి ఫెడరేషన్ నిర్ణయాన్ని ఖండించారు.
Top Headlines @9PM : టాప్ న్యూస్
ఫెడరేషన్ పక్షపాతంగా 30% వేతనాల పెంపును డిమాండ్ చేస్తోందని దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు. “ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్నవారికి, లేని వర్కర్లకు నిర్మాతలు ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎక్కువ చెల్లిస్తున్నారు” అని ఆయన స్పష్టం చేశారు. షూటింగులు ఆపేస్తామన్న హెచ్చరిక నిర్మాణంలో ఉన్న సినిమాలకు భారీ నష్టం కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దశాబ్దాలుగా ఫెడరేషన్ సభ్యులతో కలిసి పనిచేస్తున్న నిర్మాతలు ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యకు సరైన పరిష్కారం సాధించేందుకు చాంబర్ సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతుందని దామోదర్ ప్రసాద్ చెప్పారు. నిర్మాతలు ఎటువంటి స్వతంత్ర చర్యలు లేదా కార్మిక సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా, చాంబర్ నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలన్నారు. ఇదిలా ఉంటే.. రేపు ఉదయం 11గంటలకు ఫిల్మ్ ఛాంబర్ లో ప్రొడ్యూసర్స్ అత్యవసర సమావేశం కానున్నారు.