రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా స్టాండప్ కమెడియన్ సునీల్ పాల్ నీలి చిత్రాల రచ్చలోకి మనోజ్ బాజ్ పాయ్ ను లాగాడు. నేరుగా రాజ్ కుంద్రా గొడవతో ‘ద ఫ్యామిలీ మ్యాన్’కు లింకు లేకున్నా సునీల్ పాల్ అడ్డగోలు వెబ్ సిరీస్ లను తిడుతూ మనోజ్ బాజ్ పాయ్, పంకజ్ త్రిపాఠీ, అలీ ఫైజల్ లాంటి వార్ని కూడా ఏకిపారేశాడు.
రాజ్ కుంద్రా బ్లూ ఫిల్మ్స్ బిజినెస్, తదనంతర అరెస్ట్ పై సునీల్ పాల్ స్పందించాడు. శిల్పా శెట్టి భర్త లాంటి పెద్ద తలకాయల్ని జైల్లో పెట్టటం మంచేదనని ఆయన అభిప్రాయపడ్డాడు. అంతే కాదు, పొలీసుల్ని కూడా ఆయన అభినందించాడు. అయితే, అక్కడితో ఆగకుండా ఓటీటీల్లో వస్తోన్న వెబ్ సిరీస్ లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెన్సార్ లేకపోవటాన్ని ఆసరా చేసుకుని కొందరు వెబ్ సిరీస్ మేకర్స్, నటీనటులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని సూటిగా విమర్శించాడు.
Read Also : ఆకట్టుకుంటున్న “నవరస” ట్రైలర్
సునీల్ పాల్ ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ గురించి ప్రస్తావిస్తూ “భార్యకు ఎక్స్ ట్రా మ్యారిటల్ ఎఫైర్, భర్తకు మరో స్త్రీతో సంబంధం, మైనార్ కూతురుకి బాయ్ ఫ్రెండ్, చిన్న పిల్లోడైన కొడుకు తన వయస్సుకు మించి ప్రవర్తిస్తుండటం… ఇలాంటి కథతో మనోజ్ బాజ్ పాయ్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు! జాతీయ అవార్డు రాష్ట్రపతి నుంచీ అందుకుని ఇక ఏం లాభం?” అంటూ విమర్శించాడు. అంతే కాదు, ‘బడ్తమీజ్, గిరా హువా ఇన్ సాన్’ అంటూ తిట్టిపోశాడు. మనోజ్ బాజ్ పాయ్ ను ‘బుద్దిలేని వాడు, నీచుడు’ అన్న సునీల్… అలీ ఫైజల్, పంకజ్ త్రిపాఠీ, శ్వేతా త్రిపాఠీ లాంటి నటుల్ని కూడా టార్గెట్ చేశాడు. వారు నటించిన ‘మీర్జాపూర్’ గురించి మాట్లాడుతూ ‘వాళ్లంటేనే నాకు అసహ్యం’ అనేశాడు! పోర్న్ లాగే విచ్చలవిడి వెబ్ సిరీస్ లని కూడా బ్యాన్ చేయాలని ఆయన అభిప్రాయపడ్డాడు. కేవలం కళ్లకు కనిపించేది మాత్రమే పోర్న్ కాదనీ… ఆలోచనల్ని చెడగొట్టేదంతా కూడా పోర్న్ కిందకే వస్తుందని పాల్ అన్నాడు.
సునీల్ పాల్ ఆరోపణలపై మనోజ్ బాజ్ పాయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి. వెబ్ సిరీస్ లపై కూడా సెన్సార్ నియంత్రణ లాంటిది ఉండాలన్న ఆయన సూచన ఎంత మందికి నచ్చుతుందో!