దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాగూర్, రశ్మిక మందణ్ణ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘సీతారామం’. శుక్రవారం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ బుధవారం జరిగింది. దీనికి ‘డార్లింగ్’ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో మూవీపై అంచనాలు అంబరాన్ని తాకాయి. ‘సీతారామం’ మూవీలో సుమంత్ సైతం ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. విశేషం ఏమంటే సుమంత్ ఇంతవరకూ హీరోగా తప్పితే ఇలా కీలక పాత్రలు పోషించిందే లేదు. రవిబాబు ‘సోగ్గాడు’లో అతిథి పాత్రలో మెరిసిన సుమంత్, ఎన్టీయార్ బయోపిక్ మూవీస్ ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’లో తన తాతయ్య అక్కినేనిగా కాసేపు తెర మీద కనిపించారు. అయితే తొలిసారి ‘సీతారామం’లో బ్రిగేడియర్ విష్ణుశర్మగా సుమంత్ కీలక పాత్ర పోషించారు. అతని భార్యగా భూమిక నటించారు.
read also: Kolanapaka-Bachannapet: వాగు ఉధృతికి స్కూటీతో కొట్టుపోయిన టీచర్..! ఏం జరిగిందంటే..?
సుమంత్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని, ఇంతవరకూ ఇలాంటి పాత్ర చేయలేదని చెప్పారు. బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం తన పాత్ర సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని, ప్రేక్షకులకు ఆ పాత్రతో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నానని అన్నారు. సుమంత్ చెబుతున్న మాటలను వింటుంటే… ఇది ఆషామాషీ పాత్ర కాదని తెలుస్తోంది. లెఫ్టినెంట్ రామ్, అతని ప్రియురాలు సీత పాలిట విలన్ లా బ్రిగేడియర్ విష్ణుశర్మ పాత్ర ఉండబోతోందనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. రామ్ గురించి అఫ్రీన్ అనే అమ్మాయి ఆరా తీస్తోందని తెలియగానే, విష్ణు శర్మ పాత్ర కంగారు పడటం, ఆమెను ఎలాగైనా నిలువరించాలనే ప్రయత్నం చేయడం మనం ట్రైలర్ లో చూశాం. సో… ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం తన కెరీర్ లోనే తొలిసారి సుమంత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారని, దాన్ని చిత్ర బృందం గోప్యంగా ఉంచిందని అంటున్నారు. హీరోగానూ డిఫరెంట్ కథలను ఎంపిక చేసుకుంటున్న సుమంత్… బ్రిగేడియర్ విష్ణు శర్మలోని నెగెటివ్ షేడ్స్ నచ్చి ‘సీతారామం’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మరి అదే నిజమైతే…. విలన్ గా సుమంత్‌ను అక్కినేని అభిమానులు, సాధారణ ప్రేక్షకులు ఏమేరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి!