సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన చిత్రం ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. మే 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సల్మాన్, దిశా పటాని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ యాక్షన్ డ్రామా భాయ్ అభిమానులను నిరాశ పరిచింది.
సల్మాన్ నుంచి ఒక సంవత్సరం తర్వాత విడుదలైన చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. కొంతమంది సల్మాన్ అభిమానులు ఈ చిత్రం ఈద్ బ్లాక్ బస్టర్ అని అంటున్నప్పటికీ నెటిజన్లు మాత్రం ‘రాధే’ కథ నుంచి నటీనటుల వరకు అన్నింటిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఐఎండిబిలో లోయెస్ట్ రేటెడ్ చిత్రంగా ‘రాధే’ నిలవడం సల్మాన్ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ చిత్రం ఐఎండిబిలో లోయెస్ట్ రేటింగ్ పొందిన సల్మాన్ చిత్రాల్లో రెండవ చిత్రంగా నిలిచింది. 41 658 మందికిపైగా ప్రేక్షకులు ఇచ్చిన రివ్యూ ఆధారంగా ఈ రేటింగ్ ఇవ్వబడింది. ‘రాధే’ రేటింగ్ ఐఎండిబిలో 2.1/10గా ఉంది.
గతంలో సల్మాన్ నటించిన ‘రేస్-3’ చిత్రం ఐఎండిబిలో అతి తక్కువ రేటింగ్ పొందిన చిత్రంగా ఉంది. ‘రేస్-3’ 2018లో ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం రేటింగ్ ఐఎండిబిలో 1.9/10గా ఉంది. మరోవైపు రాధే చిత్రంపై సోషల్ మీడియాలో విమర్శలతో పాటు మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి.