1990లలో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించిన హీరోయిన్లలో మీనా ఒకరు. చిన్నతనంలోనే నటిగా కెరీర్ ప్రారంభించి, తర్వాత హీరోయిన్‌గా అగ్రస్థానంలో నిలిచారు. భాషతో సంబంధం లేకుండా రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సూపర్‌స్టార్‌లతో నటించి, మూడు దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. మీనా కెరీర్‌లో గ్లామర్ పాత్రలకన్నా ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే లేడీ-ఓరియెంటెడ్ పాత్రలే ఎక్కువ. అదే కారణంగా ఆమెకు విభిన్నమైన అభిమాన వర్గం ఏర్పడింది. వ్యక్తిగతంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌ను వివాహం చేసుకున్న మీనా, ఆయన ఆకస్మిక మరణం తర్వాత కూడా కూతురు నైనికతో కలిసి ధైర్యంగా జీవితం కొనసాగిస్తున్నారు.
Also Read : Rakhi Sawant : సన్నగా కనిపించడానికి పక్కటెముకలు విరగ్గొట్టుకుంటున్నారు – ఊర్వశి పై రాఖీ సావంత్ సెటైర్లు..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా, తన సినీ జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. అందులో ఒకటి బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి సంబంధించినది. మీనా మాట్లాడుతూ – “ఆ సమయంలో ఊటీలో మిథున్ చక్రవర్తికి ఒక పెద్ద హోటల్ ఉండేది. చాలా సినిమాలు అక్కడే షూటింగ్ చేసేవాళ్లం. ఆయన నన్ను చూసి ‘ఒక సినిమా అయినా నాతో చేయి’ అని ఎప్పుడూ అడిగేవారు. ‘నీ డేట్స్ ఇవ్వు, నాతో ఒక్క సినిమా చేయి’ అంటూ బలంగా రిక్వెస్ట్ చేసేవారు. కానీ అప్పట్లో తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆయన సినిమాకి సమయం కేటాయించలేకపోయాను. తర్వాత ఆయన హోటల్‌లో షూటింగ్ ఉంటేనే భయం వేసేది. ‘అయ్యో, మిథున్ గారి హోటల్‌లో రూమ్ బుక్ చేయొద్దు’ అని చెప్పేదాన్ని,” అంటూ నవ్వుతూ మీనా గుర్తుచేశారు.
మీనా చెప్పిన ఈ విషయం ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు దీన్ని సరదా జ్ఞాపకంగా తీసుకుంటే, మరికొందరు మిథున్ ప్రవర్తనను విమర్శిస్తున్నారు. మొత్తానికి, సైలెంట్‌గా ఉండే మీనా ఇలా పాత జ్ఞాపకాలు తెరమీదకు తేవడంతో సినీ వర్గాలు మళ్లీ ఆమె వైపు దృష్టి సారించాయి.