ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన తాజా చిత్రం “తగ్ లైఫ్” విడుదలకు ముందు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. “మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది” అని కమల్ హాసన్ అనడం కర్ణాటకలో తీవ్ర దుమారం రేపింది. కమల్ హాసన్ తన ప్రసంగాన్ని “ఉయిరే ఉరవే తమిళే” (నా ప్రాణం, నా బంధుత్వం తమిళం) అంటూ ప్రారంభించారు. ఆ తర్వాత, వేదికపై ఉన్న కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, “ఆయన ఇక్కడకు వచ్చారంటే, అక్కడ కూడా ఇది నా కుటుంబమే. అందుకే నా ప్రసంగాన్ని ప్రాణం, బంధం, తమిళం అని మొదలుపెట్టాను. మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది, కాబట్టి మీరు కూడా అందులో భాగమే” అని వ్యాఖ్యానించారు.
Also Read: COVID-19: భారత్‌లో కరోనాతో వ్యక్తి మృతి.. వైద్యులు ఏం చెప్పారు?
కర్ణాటకలో తీవ్ర నిరసనలు
ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. కమల్ హాసన్ తీరును “సంస్కారహీనం” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప విమర్శించారు. కన్నడ భాషను అవమానించారని ఆయన ఆరోపించారు. “మాతృభాషను ప్రేమించడం మంచిదే, కానీ ఇతర భాషలను అగౌరవించడం సంస్కారహీనమైన చర్య. కళాకారులు అన్ని భాషలను గౌరవించే సంస్కృతిని కలిగి ఉండాలి. కన్నడతో సహా అనేక భారతీయ భాషల్లో నటించిన కమల్ హాసన్, కన్నడను అవమానించడం ఆయన అహంకారాన్ని చాటుతుంది” అని యడియూరప్ప తీవ్రంగా విమర్శించారు. కన్నడ చిత్రాల్లో నటించిన కమల్ హాసన్, కన్నడిగుల ఉదారతను మరచి తన కృతఘ్నతను బయటపెట్టుకున్నారని యడియూరప్ప ఆరోపించారు.
Also Read:Anushree Satyanarayana: ఆ నలుగురు వీరే.. దిల్ రాజుపై కోర్టుకు వెళ్తా!
“తగ్ లైఫ్” బ్యాన్
“దక్షిణ భారతదేశంలో సామరస్యం తీసుకురావాల్సిన కమల్ హాసన్, గత కొన్నేళ్లుగా హిందూ మతాన్ని నిరంతరం అవమానిస్తూ, మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు 6.5 కోట్ల కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. కమల్ హాసన్ వెంటనే కన్నడిగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి” అని ఆయన డిమాండ్ చేశారు. ఏ భాష నుంచి ఏ భాష పుట్టిందో చెప్పడానికి కమల్ హాసన్ చరిత్రకారుడు కాదని ఆయన స్పష్టం చేశారు. కన్నడ అనుకూల సంఘాలు కమల్ హాసన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన సినిమాను కర్ణాటకలో నిషేధిస్తామని హెచ్చరిస్తున్నాయి. బెంగళూరులో కమల్ హాసన్ సినిమా పోస్టర్లను చించివేసి నిరసనలు తెలిపారు. “కన్నడ, కన్నడిగులకు వ్యతిరేకంగా మాట్లాడితే మీ సినిమాను రాష్ట్రంలో నిషేధిస్తామని హెచ్చరిస్తున్నాం” అని కన్నడ రక్షణ వేదిక నాయకుడు ప్రవీణ్ శెట్టి అన్నారు.