సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ మరియు బిల్వ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘జిన్’. నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన ఈ సినిమా ద్వారా చిన్మయ్ రామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి తారాగణం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 19న భారీగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాత నిఖిల్ ఎం. గౌడ మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నిర్మాత నిఖిల్ మాట్లాడుతూ.. “మాది బెంగళూరు. నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే ఎంతో ప్రాణం, ముఖ్యంగా తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తూ పెరిగాను. సినిమాలపై ఉన్న మక్కువతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. నిజానికి నటుడు కావాలనే కోరికతో వచ్చాను, కానీ అనుకోకుండా నిర్మాతగా మారాను,” అని తన సినీ ప్రయాణం గురించి వివరించారు.
Also Read :Flex by Google Pay: భారత్ లో తొలి క్రెడిట్ కార్డును ప్రారంభించిన గూగుల్..
దర్శకుడు చిన్మయ్ రామ్ ఈ కథ చెప్పినప్పుడు దానిలోని కొత్తదనం తనను బాగా ఆకర్షించిందని నిఖిల్ తెలిపారు. “సాధారణంగా ‘జిన్’ అనే కాన్సెప్ట్ గురించి చాలా మందికి తెలియదు. మేము ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఏరియాల్లో షూటింగ్ జరిపాం. కథ విన్నప్పుడు నేను ఎంతటి థ్రిల్లింగ్‌గా ఫీల్ అయ్యానో, వెండితెరపై కూడా అదే ఫీలింగ్ కలిగింది. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులను భయపెడుతూనే ఆకట్టుకుంటుంది,” అని ధీమా వ్యక్తం చేశారు.
సినిమా సక్సెస్‌లో టెక్నీషియన్ల పాత్రను కొనియాడుతూ.. “అలెక్స్ అందించిన నేపథ్య సంగీతం (RR), సునీల్ హొన్నలి విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా సినిమాను మలిచారు. అమిత్ రావ్, పర్వేజ్ సింబా సహా నటీనటులందరూ అద్భుతంగా నటించి, షూటింగ్ సమయంలో పూర్తి సహకారం అందించారు,” అని నిఖిల్ తెలిపారు. ఇకపై తెలుగు మరియు కన్నడ భాషల్లో వరుసగా సినిమాలు నిర్మిస్తానని నిఖిల్ ఎం. గౌడ ప్రకటించారు. ప్రస్తుతం కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయని, ‘జిన్’ లాంటి విభిన్న ప్రయత్నాలను ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నట్లు ఆయన ముగించారు.