తొలిసారి దర్శకత్వం వహించే దర్శకులకు సవాలక్ష సమస్యలు ఉంటాయి. నిర్మాతకు కథ చెప్పి ఒప్పించడం ఒక ఎత్తు అయితే కథానాయకుడిని మెప్పించడం మరో ఎత్తు. అనుకున్న బడ్జెట్ లో, అనుకున్న విధంగా సినిమా రూపొందించాలంటే… అతనికి వెన్నుదన్నుగా నిలవాల్సింది ప్రధానంగా ఛాయాగ్రాహకుడు. దర్శకుడి మనసులోని ఆలోచనలను గ్రహించి, దానికి అనుగుణంగా అందంగా సన్నివేశాలను కెమెరాలో బంధించాల్సింది ఆయనే. అందువల్లే దర్శకుడు, ఛాయాగ్రాహకుడి బంధం భార్యభర్తల వంటిదని సినిమా పెద్దలు చెబుతుంటారు. ఇక తొలిసారి మెగాఫోన్ పట్టుకునే డైరెక్టర్స్ కు సరైన సినిమాటోగ్రాఫర్ దొరక్కపోతే నరకమే. అదే అర్థంచేసుకునే వ్యక్తి దొరికితే చిత్ర రూపకల్పన నల్లేరు మీద బండి నడక! తన అనుభవంతో నూతన దర్శకుల పనిని అవలీలగా మార్చిన వ్యక్తి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి. మూడు దశాబ్దాల పాటు దాదాపు పాతిక మంది నూతన దర్శకులకు ఆయనే తొలి సినిమాటోగ్రాఫర్. ఆయన కెమెరాతో సిద్ధమయ్యారంటే దర్శకుడికి సగం భారం తీరిపోయినట్టే. ఇవాళ ఎస్. గోపాల్ రెడ్డి పుట్టినరోజు.
1951 జూలై 4న ఎస్. గోపాల్ రెడ్డి కృష్ణాజిల్లాలో జన్మించారు. తండ్రికి చెన్నయ్ లోని సినిమా రంగ ప్రముఖులతో ఉన్న పరిచయంతో యుక్తవయసులోనే గోపాల్ రెడ్డి అక్కడకు వెళ్ళారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ వి.ఎస్.ఆర్. స్వామి దగ్గర శిష్యరికం చేశారు. 1979లో సినిమాటోగ్రాఫర్ గా మారి కేవలం తెలుగులోనే కాకుండా పలు భాషా చిత్రాలకు పని చేశారు. అప్పట్లో జంధ్యాల దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు ఎస్. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. తొలి నంది అవార్డు కూడా ఎస్. గోపాల్ రెడ్డికి జంధ్యాల రూపొందించిన ‘ఆనంద భైరవి’ (1983) ద్వారానే వచ్చింది. ఆ తర్వాత ‘క్షణక్షణం’ (1991), ‘హలో బ్రదర్’ (1994) చిత్రాలకూ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా నంది అవార్డులను అందుకున్నారు.
నిర్మాతగానూ సత్తా!
ఎస్. గోపాల్ రెడ్డి కేవలం ఛాయాగ్రాహకుడు మాత్రమే కాదు. ఆయనలో మంచినిర్మాత కూడా ఉన్నారు. తన స్నేహితుడితో కలిసి ఆయన తొలిసారి బాలకృష్ణ హీరోగా ‘బాబాయ్ అబ్బాయ్’ మూవీని నిర్మించారు. తండ్రి మందలిస్తారనే భయంతో అప్పట్లో తన పేరును తెర మీద వేసుకోలేదు. ఆ తర్వాత కొంతకాలానికి తన స్నేహితుడు డాక్టర్ కె.ఎల్. నారాయణతో కలిసి దుర్గా ఆర్ట్స్ సంస్థను స్థాపించారు. వీరిద్దరూ కలిసి ‘క్షణక్షణం’, ‘హలో బ్రదర్’, ‘ఇంట్లో ఇల్లాలు – వంటింట్లో ప్రియురాలు’, ‘దొంగాట’, ‘సంతోషం’, ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘రాఖీ’ చిత్రాలను నిర్మించారు. నిర్మాతగా కాస్తంత గ్యాప్ తీసుకున్న గోపాల్ రెడ్డి, కె.ఎల్. నారాయణ అతి త్వరలో మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ అడ్వంచరస్ మూవీని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.
read also: Etela Rajender: టిఆర్ఎస్ నేతలు.. బావిలో కప్పలు..
తెలుగు సినిమా రంగంలో చాలామంది సినిమాటోగ్రాఫర్స్ దర్శకులుగా మారారు. అందులో ఎస్. గోపాల్ రెడ్డి శిష్యులూ అనేకమంది ఉన్నారు. గోపాల్ రెడ్డి సైతం ఒకే ఒక్కసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘ఆటోగ్రాఫ్’ మూవీని ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. రవితేజ హీరోగా ఈ సినిమాను బెల్లంకొండ సురేశ్ నిర్మించారు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో మళ్ళీ దర్శకత్వం వహించే ధైర్యం ఎస్. గోపాల్ రెడ్డి చేయలేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు రసూల్ ఎల్లోర్ ఎస్. గోపాల్ రెడ్డికి స్వయానా బావమరిది. రసూల్ సోదరినే గోపాల్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎస్. గోపాల్ రెడ్డి తనయుడు సందీప్ సైతం సినిమాటోగ్రఫీలో శిక్షణ తీసుకుని ఛాయాగ్రాహకుడిగా కొనసాగుతున్నారు. ఏడు పదుల వయసులోనూ చురుకుగా ఉంటున్న ఎస్. గోపాల్ రెడ్డి రాబోయే రోజుల్లో నిర్మాతగా, ఛాయాగ్రాహకుడిగా మరిన్ని చిత్రాలు రూపొందించాలని ఆశిద్దాం.