సాధారణంగా కమర్షియల్ సినిమాలన్నీ ప్రేమతో మొదలై పెళ్లితో ‘ద ఎండ్’ అవుతాయి. కానీ, సుమంత్, నైనా గంగూలీ నటించిన ‘మళ్లీ మొదలైంది’ సినిమా విషయంలో… శుభం కార్డు నుంచీ కథ మొదలయ్యేలా కనిపిస్తుంది! ‘లైఫ్ ఆఫ్టర్ డైవోర్స్’ అంటున్నాడు అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్…
నిజానికి ‘మళ్లీ మొదలైంది’ సినిమాకు సంబంధించి ఓ వెడ్డింగ్ కార్డ్ ఫోటో అనూహ్యంగా లీకైంది. దాంతో అందరూ సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడని భావించారు. రామ్ గోపాల్ వర్మ అయితే రెండో పెళ్లి వద్దంటూ హెచ్చరించాడు కూడా! ఈ రచ్చ మొత్తం జరిగాక సుమంత్ ఓ వీడియో మెసేజ్ లో ‘అబ్బే అలాంటిదేం లేద’ని తేల్చి చెప్పేశాడు. కాకపోతే, మళ్లీ పెళ్లి వార్తల్ని కొట్టేసిన సుమంత్ కొద్ది గంటల తేడాలోనే ‘మళ్లీ మొదలైంది’ అప్ డేట్ అందించాడు. సినిమా ఫస్ట్ లుక్ ట్విట్టర్ లో షేర్ చేశాడు.
Read Also : అన్నతో పోల్చుకుంటూ… ‘వర్క్ ఇన్ ప్రొగ్రెస్’ అంటోన్న అల్లు శిరీష్!
తమ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘డైవోర్స్ అండ్ రీ మ్యారేజ్ గురించి’ అంటూ హింట్ ఇచ్చిన సుమంత్ ‘తెలుగు తెరపై తొలిసారి’ అని కూడా అన్నాడు. చూడాలి మరి కీర్తి కుమార్ డైరెక్ట్ చేసిన ఈ డిఫరెంట్ ఎంటర్టైనర్ ఎలా ఉండబోతోందో! ‘మళ్లీ మొదలైంది’ వచ్చే నెలలో థియేటర్ల వద్దకి రావచ్చని టాక్…