Bimbisara – Sitharamam:శుక్రవారం విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాలకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లు ఈ రెండు సినిమాల కారణంగా కళకళలాడుతున్నాయి. దాంతో చిత్రసీమలో ఓ పండగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం నిర్మాతలు షూటింగ్స్ ను ఆపేసి, తమ సమస్యలపై వివిధ శాఖలతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఒకే రోజు విడుదలైన రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
విశేషం ఏమంటే… మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని చాలామంది సినీ ప్రముఖులు, యువ కథానాయకులు, సాంకేతిక నిపుణులు ఈ రెండు సినిమాలు సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అదే బాటలో తెలుగు నిర్మాతల మండలి సైతం ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాలకు ప్రేక్షకుల నుండి లభిస్తున్న ఆదరణ పట్ల హర్షం వ్యక్తం చేసింది. ‘ప్రస్తుత సినిమా పరిశ్రమ ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఈ రెండు సినిమాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆక్సిజన్ అందించినట్టుగా అందరూ భావిస్తున్నార’ని పేర్కొంటూ, ఆ రెండు చిత్ర నిర్మాతలకు, దర్శకులకు, ఇతర సాంకేతిక నిపుణులకు తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల శుభాకాంక్షలు తెలిపారు.