2022 Filmy Rewind: తెలుగు సినిమా రంగానికి చెందిన దిగ్గజ నటులు అభిమానులను శోక సంద్రంలో ముంచి దివికేగారు. జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందిన పలువురు ఈ యేడాది కన్నుమూశారు. వయోధిక కారణాలతో కొందరు, కరోనానంతర సమస్యలతో కొందరు చనిపోయారు. చిత్రం ఏమంటే అనారోగ్య సంబంధాలతో పెద్దవాళ్ళు, ప్రేమ విఫలమై చిన్నవాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు కళాకారులను తీవ్రవాదులు ముట్టబెట్టారు. నటీనటులే కాకుండా సంగీత రంగానికి చెందిన ప్రముఖులూ ఈ యేడాది దివికేగటం ఎంతోమంది సంగీత ప్రియులను కలచివేసింది.
‘అనురాధ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై దాదాపు 75 సినిమాలను తెరకెక్కించిన పి. చంద్రశేఖర్ రెడ్డి (88) చెన్నయ్ లో జనవరి 3న కన్నుమూశారు. కృష్ణ హీరోగా అత్యధికంగా 22 సినిమాలను ఆయన రూపొందించారు. కృష్ణ హీరోగా నటించిన టీవీ సీరియల్ ‘అన్నయ్య’కు చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అకాడమీ అవార్డ్ పొందిన మొదటి నల్లజాతి నటుడు సిడ్నీ పోయ్‌టియర్ (94) జనవరి 6న కన్నుమూశారు. ‘లివీస్ ఆఫ్ ద ఫీల్డ్’ చిత్రానికి గానూ ఆయన ఆస్కార్ అవార్డు అందుకున్నారు. సీనియర్ నటుడు కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు (56) 8వ తేది అనారోగ్యంతో తనువు చాలించాడు. ‘అగ్నిపరీక్ష’ చిత్రంలో బాలనటుడిగా తెరంగేట్రమ్ చేసిన రమేశ్ బాబు ‘సమ్రాట్’ మూవీతో హీరో అయ్యాడు. అతని చివరి చిత్రం ‘ఎన్‌కౌంటర్’. తమ్ముడు మహేశ్ నటించిన ‘అర్జున్, అతిథి, దూకుడు, ఆగడు’కు నిర్మాణ భాగస్వామిగా రమేశ్ బాబు వ్యవహరించారు. ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు, పద్మవిభూషణ్ పండిట్ బిర్జు మహారాజ్ (83) గుండెపోటుతో 17వ తేది కన్నుమూశారు. ‘దేవదాస్, దేదే ఇష్కియా, ఉమ్రవ్ జా, బాజీరావ్ మస్తానీ, విశ్వరూపం’ చిత్రాలకు ఆయన నృత్యరీతులు సమకూర్చారు. పలు తెలుగు చిత్రాలలో కామెడీ పాత్రలు పోషించిన కొంచాడు శ్రీనివాస్ (47) 19వ తేది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అనారోగ్యంతో తుది శ్వాస విడిచాడు. ”రంగులకల, హరిజన్, కాంచన సీత” వంటి చిత్రాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసిన గుడిమళ్ళ భూషణ్ కుమార్ (68) హైదరాబాద్ లో జనవరి 31న కన్నుమూశారు.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఫిబ్రవరి 6వ తేదీ కోట్లాది మంది సంగీతాభిమానులను దుఃఖ సాగరంలో ముంచుతూ భారతరత్న, గానకోకిల లతా మంగేష్కర్ (92) దివికేగారు. లత తన కెరీర్‌లో వివిధ భాషల్లో దాదాపు 36 వేల పాటలు పాడారు. టీవీ సీరియల్ ‘మహాభారత్’లో భీముడి పాత్రధారి ప్రవీణ్ కుమార్ సోబ్తీ (74) ఫిబ్రవరి 7న గుండెపోటుతో కన్నుమూశారు. పలు చిత్రాలలోనూ నటించిన ప్రవీణ్ కుమార్, రాజకీయ రంగంలోనూ కీలక పాత్ర పోషించారు. ప్రముఖ నటీమణి రవీనా టాండన్ తండ్రి, దర్శక నిర్మాత, రచయిత రవీ టాండన్(86) 11వ తేది కన్నుమూశారు. ‘ఖేల్ ఖేల్ మే, అన్హోని, నజరానా, మజ్బూర్, ఖుద్ దార్, జిందగీ’ వంటి చిత్రాలు ఆయన డైరెక్ట్ చేశారు. లతా మంగేష్కర్ నిష్క్రమణ వార్త నుండి కోలుకోకముందే, 16వ తేదిన ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహరి (69) కన్నుమూశారు. ‘డిస్కో డాన్సర్’తో సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బప్పీ లహరి తెలుగులోనూ ‘సింహాసనం’తో మొదలు పెట్టి పాతిక చిత్రాలకు స్వరరచన చేశారు. ఇటీవల వచ్చిన ‘డిస్కో రాజా’లో ఓ పాట పాడారు.
ప్రముఖ సినీ గీత రచయిత కందికొండ యాదగిరి (49) మార్చి 12న అనారోగ్యంతో కన్నుమూశారు. ‘ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం’తో గీత రచయితగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన పలు చిత్రాలకు పాటలు రాశారు. ప్రముఖ తబలా విద్వాంసులు, దాదాపు 1500 చిత్రాలకు పనిచేసిన ‘తబలా’ ప్రసాద్ (79) చెన్నయ్ లో 18వ తేది కన్నుమూశారు. షార్ట్ ఫిల్మ్ నటి, యూ ట్యూబర్ డాలీ డి క్రూజ్ ఉరఫ్ గాయత్రి శంకర్ (26) హోలీ వేడుకల్లో పాల్గొని వస్తూ 18న రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయింది. ‘మేడమ్ సర్ మేడమ్ అంతే’ వెబ్ సీరిస్‌లోనూ గాయత్రి నటించింది.
ప్రముఖ దర్శకుడు శరత్ (72) అనారోగ్యంతో ఏప్రిల్ 1న హైదరాబాద్ లో కన్నుమూశారు. ‘చాదస్తపు మొగుడు’తో దర్శకుడిగా మారిన శరత్ దాదాపు పాతిక చిత్రాలు రూపొందించారు. బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు, రాజేంద్ర ప్రసాద్, సుమన్, నవీన్, శ్రీహరితో శరత్ సినిమాలు తెరకెక్కించారు. సీనియర్ నటుడు, దర్శక నిర్మాత మన్నవ బాలయ్య (92) 9వ తేది అనారోగ్యంతో కన్నుమూశారు. 1958లో ‘ఎత్తుకు పై ఎత్తు’ సినిమాతో తెరంగేట్రమ్ చేసిన ఆయన అమృత ఫిలిమ్స్ బ్యానర్ పై 10 సినిమాలు నిర్మించారు. ”ఊరికిచ్చిన మాట, నిజం చెబితే నేరమా, కిరాయి అల్లుడు, పసుపుతాడు” వంటి చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రఘుపతి వెంకయ్య అవార్డును 2012లో అందుకున్నారు. ఏషియన్ ఫిలిమ్స్ అధినేత, ప్రముఖ పంపిణీదారుడు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ (76) 19న అనారోగ్యంతో కన్నుమూశారు. అదే రోజు అర్థరాత్రి ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు (84) చెన్నయ్ లో కన్నుమూశారు. ‘నవరాత్రి’తో దర్శకుడైన తాతినేని రామారావు తెలుగుతో పాటు పలు హిందీ చిత్రాలకూ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు సతీమ్ గౌస్ (70) గుండెపోటుతో ఏప్రిల్ 28న చనిపోయారు. 1978లో ‘స్వర్గ్ నరక్’ మూవీతో తెరంగేట్రమ్ చేసిన సలీమ్ హిందీ సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటించారు. తెలుగులోనూ “రక్షణ, అంతం, ముగ్గురు మొసగాళ్ళు” తమిళ చిత్రం ‘తిరుడ తిరుడ’లోనూ నటించారు.
Read also: Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీగా వరదలు.. 13 మంది మృతి
మే 10వ తేదీన ప్రముఖ సంతూర్ విద్వాంసులు పండిట్ శివశంకర్ శర్మ (83) అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. జమ్ములో జన్మించిన ఆయన ముంబైలో స్థిరపడ్డారు. వేణు గాన విద్వాంసులు హరిప్రసాద్ చౌరాసియాతో కలిసి ‘శివ-హరి’ పేరుతో ‘సిల్ సిలా, లమ్హే, చాందినీ, డర్’ వంటి చిత్రాలకు సంగీతం సమకూర్చారు. నృత్యదర్శకురాలు టీనా సాధు గోవాలో అనుమానాస్పద స్థితిలో 11న మృతి చెందారు. రియాలిటీ షో ‘ఆట’తో ఆమెకు గుర్తింపు వచ్చింది. కొన్ని సినిమాలు, సీరియల్స్ కు ఆమె కొరియోగ్రఫీ అందించారు. నటుడు కెప్టెన్ చలపతి చౌదరి (67) అనారోగ్యంతో 19న కర్ణాటక రాయచూర్ లోని హాస్పిటల్ లో కన్నుమూశారు. సీనియర్ నిర్మాత ఎం. రామకృష్ణారెడ్డి చెన్నయ్ లో 25వ తేదీ చనిపోయారు. 1948లో నెల్లూరు జిల్లా గూడూరులో జన్మించిన ఆయన ‘అభిమానవంతులు, వైకుంఠపాళి, గడుసుపిల్ల, సీతాపతి సంపారం, మావూరి దేవత, అల్లుడుగారు జిందాబాద్, అగ్ని కెరటాలు, అమ్మోరు తల్లి (డబ్బింగ్), మూడిళ్ళ ముచ్చట” తదితర చిత్రాలు నిర్మించారు. 25వ తేదిన కశ్మీరీ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ (36)ను ముగ్గురు లష్కరే తోయిబా టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఇది జరిగి నాలుగు రోజులు గడవకముందే, 29న పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నేత శుభ్ దీప్ సింగ్ సిద్థూ అలియాస్ సిద్ధూ మూసేవాలా (29) దారుణ హత్యకు గురయ్యాడు. అతని హత్యకు తామే కారకులమని పంజాబీ గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించాడు. వీనుల విందైన గాత్రంతో వివిధ భాషల్లో లక్షలాది మంది సంగీత ప్రియులను అలరించిన ప్రముఖ గాయకుడు కె.కె. (కృష్ణకుమార్ కున్నత్) (53) గుండెపోటుతో కోల్ కతాలో మే 31వ తేదీ కన్నుమూశాడు. ఓ కాలేజీ ఈవెంట్ లో పాల్గొనడానికి ఆయన కోల్ కతా వెళ్ళారు. ‘ప్రేమదేశం’ మూవీతో గాయకుడిగా పాపులారిటీ సంపాదించుకున్న కెకె తెలుగులో స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
జూన్ 2న ‘వరం, బ్యాచిలర్స్’ చిత్రాలలో హీరోగా నటించిన సత్య గుండెపోటుతో కన్నుమూశారు. బాలీవుడ్, టాలీవుడ్ లో ఫ్యాషన్ డిజైనర్ గా పేరు తెచ్చుకున్న ప్రత్యూష గరిమెళ్ళ 11వ తేది ఆత్మహత్య చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు 30 మంది ప్రముఖులకు ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరించారు. కరోనా కారణంగా కొన్ని నెలలుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న నటి మీనా భర్త విద్యాసాగర్ (48) 28న తుదిశ్వాస విడిచారు.
Read also: Fire Accident: విషాదం.. అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
జూలై 4న బెంగాలీ దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత తరుణ్ మజుందార్ (92) అనారోగ్యంతో కన్నుమూశారు. 60 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన 40 చిత్రాలు తెరకెక్కించారు. దర్శకుడిగా నాలుగు జాతీయ అవార్డులను అందుకున్నారు. సీనియర్ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరి 5వ తేది చనిపోయారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ‘మాకూ స్వాతంత్రం కావాలి’ చిత్రానికి మాటలు రాశారు. వేలాది చిత్రాలను సమీక్షించారు. ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు (68) 6వ తేది కన్నుమూశారు. ‘చట్టానికి కళ్ళు లేవు’ సినిమాతో 1981లో ఎడిటర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆరు నంది అవార్డులు అందుకున్నారు. సీనియర్ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ (86) 7వ తేదీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆరేళ్ళ పాటు మెజిస్ట్రేట్ గా పనిచేసిన ఆయన ఆ తర్వాత రామానాయుడుతో కలిసి ‘రాముడు భీముడు, శ్రీకృష్ణ తులాభారం, ప్రతిజ్ఞ, స్త్రీ జన్మ, ఒక చల్లని రాత్రి’ సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత ‘కురుక్షేత్రం, ఆటగాడు’ చిత్రాలు ప్రొడ్యూస్ చేశారు. జూలై 15వ తేదిన ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ (70) చెన్నయ్ లో కన్నుమూశారు. వివిధ భాషల్లో ఆయన దాదాపు వంద చిత్రాలలో నటించారు. పన్నెండు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు రెండు చిత్రాలు నిర్మించారు. నాగార్జున ‘చైతన్య’ చిత్రానికి ఆయనే దర్శకుడు 1985లో రాధిక ను వివాహం చేసుకుని యేడాదికే విడాకులు ఇచ్చారు. 1990లో అమల సత్యనాధన్ ను పెళ్ళాడారు. 2012లో ఆమెకూ విడాకులిచ్చారు. జూలై 18వ తేది ప్రముఖ గిటారిస్ట్, ప్లే బ్యాక్ సింగర్, గజల్ గాయకుడు భూపేందర్ సింగ్ (82) అనారోగ్యంతో చనిపోయారు.
ఆగస్ట్ 1న సీనియర్ నటుడు సారథి (83) అనారోగ్యంతో కన్నుమూశారు. ‘సీతారామ కళ్యాణం’ సినిమాతో నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన 300 పైగా చిత్రాలలో నటించారు. ప్రభాకరరెడ్డి సహకారంతో పలు చిత్రాలను నిర్మించారు. ట్విన్ సీ క్లబ్, చిత్రపురి కాలనీ నిర్మాణంలో చురుకైన పాత్రను పోషించారు. ”తహల్కా, జవాబ్, పోలీస్ వాలా గుండా, జీనియస్” తదితర చిత్రాల నిర్మాత కృష్ణ చంద్ర శర్మ ముంబైలో 19వ తేది తుదిశ్వాస విడిచారు. ఈయన కుమారుడు అనిల్ శర్మ దర్శకుడు. అదే రోజు ప్రముఖ దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ సోదరుడు, దర్శక నిర్మాత, ఛాయాగ్రాహకుడు రాజేంద్ర ప్రసాద్ తుదిశ్వాస విడిచారు. 1995లో ‘నిరంతరం’ సినిమాను స్వీయ దర్శకత్వంలో ఆయన నిర్మించారు. తెలుగులో ‘మేఘం, హీరో’ తో పాటు పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఇదిలా ఉంటే… 23వ తేదిన టిక్ టాక్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనాలీ ఫోగాట్ (42) గుండెపోటుతో గోవాలో మరణించింది. అయితే ఆమె మరణాన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు నిర్ధారించి విచారణ చేపట్టారు. 28వ తేదిన నటుడు విద్యాసాగర్ (73) హైదరాబాద్ లో కన్నుమూశారు. జంద్యాల, వేజెళ్ళ సత్యనారాయణ, కె. విశ్వనాథ్ చిత్రాలలో విద్యాసాగర్ కీలక పాత్రలు పోషించారు. ఆయన భార్య రత్నసాగర్ కూడా నటి.
Read also: India Squad: శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టు ప్రకటన
రెబల్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు. కృష్ణంరాజు (82) సెప్టెంబర్ 11వ తేది అనారోగ్యంతో కన్నుమూశారు. 1966లో ‘చిలక – గోరింక’ చిత్రంతో సినిమా రంగంలోకి అడుగపెట్టిన ఆయన ఐదు దశాబ్దాల పాటు ఈ రంగంలో నటుడిగా, నిర్మాతగా రాణించారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘రాధేశ్యామ్’ ఇదే యేడాది విడుదలైంది. 17వ తేదిన తమిళ సినీ నటి పౌలిన్ జెస్సిక అలియాస్ దీప (29) చెన్నయ్ లోని విరుగం బాక్కంలోని ఫ్లాట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ‘వైతా’ సినిమాలో నాయికగా నటించిన ఆమె పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలూ చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కమెడియన్, టీవీ పర్సనాలిటీ శ్రీవాత్సవ (58) న్యూఢిల్లీలో 21వ తేది కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జన్మించిన శ్రీవాత్సవ ఆ రాష్ట్రంలోని ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గానూ సేవలు అందించారు. సెప్టెంబర్ 28వ తేదిన సీనియర్ నటుడు కృష్ణ సతీమణి ఇందిరాదేవి (70) అనారోగ్యంతో కన్నుమూశారు. మహేశ్ బాబుతో రమేశ్ బాబు, మంజుల నిర్మించిన చిత్రాలకు ఆమె సమర్పకురాలిగా వ్యవహరించారు.
అక్టోబర్ 7న ప్రముఖ నిర్మాత, పంపిణీ దారుడు, ఎగ్జిబిటర్ మాగుంట సుధాకర్ రెడ్డి (73) చెన్నయ్ లోని హాస్పిటల్ లో కన్నుమూశారు. మాగుంట సుబ్బరామిరెడ్డి, శ్రీనివాసుల రెడ్డి సోదరుడైన సుధాకర్ రెడ్డి ‘అంతిమతీర్పు, పృథ్వీరాజ్, ధర్మతేజ’ తదితర చిత్రాలతో పాటు ‘ఖైదీ’ చిత్రానికి భాగస్వామిగా వ్యవహరించారు. అంబరీష్ హీరోగా కన్నడలోనూ నాలుగు సినిమాలు నిర్మించారు. అదే నెల 15వ తేది సీనియర్ ప్రొడ్యూసర్ కాట్రగడ్డ మురారి (78) అనారోగ్యంతో చెన్నయ్ లో కన్నుమూశారు. ఎంబీబీయస్ చదువు మధ్యలో ఆపేసి ఆయన సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. యువ చిత్ర పతాకంపై ‘సీతామాలక్ష్మీ, గోరింటాకు, త్రిశూలం, నారీనారీ నడుమ మురారి’ వంటి ఎనిమిది చిత్రాలు నిర్మించారు. మిత్రులతో కలిసి ‘జే గంటలు’ చిత్రం ప్రొడ్యూస్ చేశారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల చరిత్ర పుస్తకానికి సంపాదకులుగా వ్యవహరించారు. 18వ తారీఖున ప్రముఖ రచయిత, జర్నలిస్ట్, సినీ గీత రచయిత, వెండితెర నవలలు రాసిన ఎం.కె. సుగమ్ బాబు (78) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు మహబూబ్ ఖాన్.
Read also: Off The Record about TDP: గెలిచేందుకు టీడీపీ నానా తంటాలు..! సొంత అజెండాతో కుమ్మక్కు రాజకీయాలు..!
నవంబర్ 13న రంగస్థల, వెండితెర నటుడు, ఫిల్మ్ జర్నలిస్ట్ డి.ఎం.కె. మురళీ అనారోగ్యంతో కన్నుమూశారు. ‘అందాల రాక్షసి, బస్ స్టాప్, తడాఖా, కొత్తజంట, కాయ్ రాజా కాయ్’ తదితర చిత్రాలలో ఆయన నటించారు. నవంబర్ 15వ తేదీ తెల్లవారు ఝామున సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. ‘తేనెమనసులు’ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి హీరోగా అడుగుపెట్టిన కృష్ణ మూడు వందలకు పైగా చిత్రాలలో నటించారు. కేంద్రప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డునూ అందుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్రను వేశారు కృష్ణ. 19వ తేది సీనియర్ నటీమణి, టీవీ పర్సనాలీటీ కిరణ్ బాల సచిదేవ్ (తబస్సుమ్) గుండెపోటుతో కన్నుమూశారు. అదే రోజు ‘ఆ నలుగురు’ చిత్రానికి రచన చేసి, ఆ పైన ”పైళ్ళైన కొత్తలో, గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి” చిత్రాలను తెరకెక్కించిన మదన్ అనారోగ్యంతో కన్నుమూశారు.
డిసెంబర్ 23వ తేదీ సీనియర్ నటుడు, నిర్మాత కైకాల సత్యనారాయణ (87) అనారోగ్యంతో కన్నుమూశారు. నటుడిగానే కాకుండా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగానూ ఆయన ప్రజలకు సేవలందించారు. ‘సిపాయి కూతురు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ప్రతినాయకుడి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రమా ఫిలిమ్స్ పతాకంపై అగ్ర కథానాయకులతో పలు చిత్రాలను నిర్మించారు. 24వ తేది తెలుగు సినిమా రంగంలో అందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే చలపతి రావు (78) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ‘కథానాయకుడు’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన చలపతిరావు వెయ్యికి పైగా చిత్రాలలో నటించారు. ఆయన కుమారుడు రవిబాబు నటుడు, దర్శకుడు. అదే రోజున హిందీ నటి తునిషా శర్మ (21) ఆత్మహత్యకు పాల్పడింది. తన సహ నటుడు షీజన్ మహ్మద్ ఖాన్ మేకప్ రూమ్ లో ఆమె ఉరి వేసుకుంది. వీరిద్దరూ కొంతకాలం క్రితం సహజీవనం చేశారు. ‘భారత్ కా వీర్ పుత్ర’ సీరియల్ తో 13 యేళ్ళకే బాలనటిగా తునిషా శర్మ కెరీర్ ప్రారంభించింది. ‘ఫితూర్’ మూవీలో చిన్నప్పటి కత్రినా కైఫ్ పాత్ర పోషించింది. ‘బార్ బార్ దేఖో’, ‘కహానీ -2’, ‘దబాంగ్ -3’ చిత్రాలలో ఆమె నటించింది.
బాలయ్య మనోభావాలను దెబ్బతీసిన బ్యూటీ.. యమా హాట్