తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ గా జేజేలు అందుకున్న చిరంజీవి, రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. తన సినీజనానికి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాని పరిష్కారం కోసం ఎవరు నడుం బిగిస్గారు అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ఇదిగో నేనున్నాను అంటూ చిరంజీవి ముందడుగు వేశారు. కరోనా కల్లోల సమయంలోనూ, భారీ చిత్రాల టిక్కెట్ రేట్ల పెంపు విషయంలోనూ చిరంజీవి చూపిన చొరవను ఎవరూ మరచిపోలేరు. ఇక తన కుటుంబ సభ్యుల్లో అనేకమందిని కథానాయకులుగా తీర్చిదిద్ది ‘మెగా కాంపౌండ్’కు అసలైన గాడ్ ఫాదర్ గా నిలిచారు చిరంజీవి. త్వరలోనే తెరపై ‘గాడ్ ఫాదర్’గానూ దర్శనమివ్వనున్నారాయన.
చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22వ తేదీ ఆయన అభిమానులకు ఓ పండుగ రోజు అనే చెప్పాలి. ఆ రోజున ఊరూరా వాడవాడలా చిరంజీవి ఫ్యాన్స్ ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమం చేసి సంతృప్తి పొందుతూ ఉంటారు. వారిని మెప్పించడానికి అన్నట్టు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు చిరంజీవి. తాను మెగాస్టార్ గా నిలచింది మొదలు, ఇప్పటి దాకా చిరంజీవి ‘స్వయంకృషి’నే నమ్ముకున్నారు. ఆరున్నర పదులు పైబడుతున్నా ఇప్పటికీ తన ఎస్సెట్స్ అయిన డాన్సులతోనూ, ఫైట్స్ తోనూ అలరిస్తున్నారాయన. ఆయన అభిమానులు సైతం జయాపజయాలతో నిమిత్తం లేకుండా చిరంజీవి నటించిన చిత్రాలను చూడటానికి పరుగులు తీస్తూనే ఉన్నారు. అదే తీరున ఆయన చేసే సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ ఉడతాభక్తిగా పాలు పంచుకుంటున్నారు. చిరంజీవి అభిమానగణమే ‘మెగా కాంపౌండ్’కు శ్రీరామరక్ష అని చెప్పక తప్పదు. చిరు ఫ్యామిలీ హీరోస్ కూడా ఆయన చూపిన పంథాలోనే కష్టించి పనిచేస్తూ జనాన్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
చిరంజీవి వేసిన పునాదులపైనే ఆయన తమ్ముళ్ళు నాగబాబు, పవన్ కళ్యాణ్ తమ ఉనికిని చాటుకున్నారు. చిరంజీవి ఇమేజ్ తోనే ఆయన ఫ్యామిలీలోని ఇతర హీరోలూ రాణించారు. తన కుటుంబం నుండి వచ్చే ప్రతీ హీరో జనాన్ని ఆనందింప చేయాలన్నదే చిరంజీవి అభిలాష. అందువల్లే వారి సినిమాల విషయంలోనూ ఎంతో శ్రద్ధ వహించి, వారికి తగిన సలహాలూ, సూచనలూ ఇస్తూ ఉంటారు చిరంజీవి. తెలుగు చిత్రసీమలో అంతలా శ్రద్ధ వహించి, తమ వారి ఉన్నతికి పాటుపడే స్టార్ హీరో మరొకరు కానరారు. అందుకే ‘మెగా కాంపౌండ్’కు చిరంజీవి అసలు సిసలు ‘గాడ్ ఫాదర్’ అని చెప్పక తప్పదు. అక్టోబర్ 5న చిరంజీవి ‘గాడ్ ఫాదర్’గా జనం ముందు నిలువనున్నారు. తెరపై ‘గాడ్ ఫాదర్’ గా అలరించనున్న చిరంజీవిని ఫ్యాన్స్ సైతం అదే తీరున భావిస్తూ విజయతీరాలలో పయనింప చేస్తారని ఆశించవచ్చు.