యువ రచయిత, దర్శకుడు బీవీయస్ రవి ఏ విషయం గురించి అయినా తన మనసులో మాటను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తారు. అయితే ఆ ముక్కుసూటి తనమే ఇటీవల ఆయన్ని ఇబ్బందులకు గురిచేసింది. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ – బీవీయస్ రవి మధ్య తీవ్రస్థాయిలో ట్విట్టర్ వార్ కు కారణమైంది. బీవీయస్ రవి చేసిన ఓ ట్వీట్ ను హరీశ్ శంకర్ విమర్శించాడు. తన వాదనను బలపరుస్తూ బీవీయస్ రవి సెటైరిక్ గా చేసిన వ్యాఖ్య అది అని వివరణ ఇచ్చారు. ఎదుటి వ్యక్తికి అది సెటైర్ అని అర్థం కాకపోతే ప్రయోజనం ఏమిటనే తరహాలో తిరిగి హరీశ్ విమర్శనాస్త్రం సంధించాడు. అయితే… ఈ మొత్తం ఎపిసోడ్ లో బీవీఎస్ రవి, హరీశ్ శంకర్ కంటే… వారి ఫ్యాన్స్, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. రవిని సపోర్ట్ చేస్తూ కొందరు, హరీశ్ ను బలపరుస్తూ కొందరు రెండుగా చీలిపోయారు. ‘ఈ వ్యవహారం పక్కదారి పట్టిందని గ్రహించడంతో తాను ట్విట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేశాన’ని బీవీయస్ రవి ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ కు తెలిపారు.
దర్శకుడు హరీశ్ శంకర్ తో తనకు రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉందని, ఒకరిని ఒకరు బావా అని పిలుచుకునేంత చనువు ఉందని చెప్పారు. అయితే… ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయని, తాను కొన్ని విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తానని, అది కొందరికి నచ్చకపోవచ్చునని రవి అన్నారు. హరీశ్ శంకర్ తో ట్వీట్స్ వార్ జరిగిన తర్వాత తాను ప్రత్యేకించి ఫోన్ చేసి వివరణ ఇవ్వలేదని, అలాంటి అవసరం ఉందని కూడా అనుకోవడం లేదని బీవీయస్ రవి చెప్పారు. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా తాను సినిమా టిక్కెట్ రేట్ల గురించి ఆ ట్వీట్ చేయలేదని, ‘ముద్రారాక్షసం’ నాటకంలోని కొన్ని వాక్యాలను తాను ఉదహరించానని, కానీ కొందరు మరోలా అర్థం చేసుకున్నారని, నిజానికి మూవీ టిక్కెట్ రేట్ల గురించి అభిప్రాయం చెప్పేంత సీన్ తనకు లేదని బీవీయస్ రవి అన్నారు.