Ayan Mukharji: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం గత యేడాది సెప్టెంబర్ 9వ తేదీ విడుదలైంది. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ‘బ్రహ్మస్త’ మెప్పించలేకపోయింది. దాంతో ఈ ట్రియాలజీకి సంబంధించిన రెండు, మూడు పార్ట్స్ వస్తాయో రావో అనే సందేహాలు బాలీవుడ్ లో నెలకొన్నాయి. వాటికి అయాన్ ముఖర్జీ తెర దించాడు. తన అభిమానులను ఉద్దేశించి ఓ ఓపెన్ లెటర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ‘ఒకేసారి బ్రహ్మాస్త్ర 2, 3 భాగాల షూటింగ్ ను జరుపుతామని, అలానే పెద్దంత తేడా లేకుండా ఈ రెండు సినిమాలను జనం ముందుకు తీసుకొస్తామ’ని తెలిపాడు. ‘మొదటి భాగానికి వచ్చిన స్పందనను బట్టి, ప్రేక్షకులు తన నుండి మరింత మంచి, భారీ చిత్రాన్ని ఆశిస్తున్నట్టు అర్థమైందని, వారి అంచనాలను అందుకునేలా స్క్రిప్ట్ తయారు చేయడానికి మరికొంత సమయం అవసరం అవుతుంద’ని అయాన్ అభిప్రాయపడ్డాడు.
అదే సమయంలో అయాన్ తనకో సరికొత్త ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని తెలిపాడు. తనను ఎంతో ఎగ్జైట్ చేసిన ఆ స్పెషల్ ప్రాజెక్ట్ ను అంగీకరించడానికి తాను సిద్ధపడ్డానని, అది తనకు ఛాలెంజ్ తో పాటు, లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ లాంటిందని అయాన్ చెప్పాడు. ‘బ్రహ్మాస్త్ర’ రెండు, మూడు భాగాల కంటే ముందే అయాన్ ఈ కొత్త సినిమాను టేకప్ చేయొచ్చనిపిస్తోంది. ఎందుకంటే ‘బ్రహ్మాస్త్ర’ రెండో భాగాన్ని 2026లోనూ, మూడో భాగాన్ని 2027లోనూ విడుదల చేస్తామని గతంలో చెప్పారు. ఇప్పుడు వాటికి మరింత సమయం పడుతుందని అంటున్నారు. సో… ఈ మధ్యలో అయాన్ ఈ కొత్త ప్రాజెక్ట్ చేసే ఆస్కారం ఉందనిపిస్తోంది. బట్… తనను ఎంతో ఎగ్జైట్ చేసిన ఆ ప్రాజెక్ట్ గురించి మాత్రం అయాన్ ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.