నటుడు భానుచందర్ ఈ తరం వారికి కేరెక్టర్ యాక్టర్ గా పరిచయం. కానీ, ఒకప్పుడు మార్షల్ ఆర్ట్స్ తో తనదైన బాణీ పలికిస్తూ హీరోగానూ మురిపించారు. అనేక చిత్రాలలో విలక్షణమైన పాత్రల్లోనూ అలరించారు. చూడటానికి ఇప్పటికీ నాజూగ్గా కనిపించే భానుచందర్ ఈ యేడాదితో 70 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు.
మద్దూరు వెంకటసత్య సుబ్రహ్మణ్యేశ్వర భానుచందర్ ప్రసాద్ గా 1952 మే 31 న భానుచందర్ జన్మించారు. ఆయన తండ్రి మాస్టర్ వేణు ఆ రోజుల్లో పేరు మోసిన సంగీత దర్శకులు. తండ్రిలాగే భానుచందర్ కూడా సంగీతంతో అలరించే ప్రయత్నం చేశారు. తరువాత అనూహ్యంగా భానుచందర్ వ్యసనాలకు బానిస అయ్యారు. మిత్రులు సైతం భానుచందర్ పని అయిపోయిందనీ భావించారు. ఆ సమయంలో కన్నతల్లి ప్రేమనే తనను మనిషిగా మార్చిందని చెబుతారు భానుచందర్. డ్రగ్ అడిక్ట్ గా మారిన భానుచందర్ తల్లికి ఇచ్చిన మాటతో ఆ మహమ్మారి నుండి దూరంగా జరిగి, బాడీ బిల్డింగ్, మార్షల్ ఆర్ట్స్ పై మనసు లగ్నం చేశారు. ఆ సమయంలోనే నటనపై అభిలాష కలిగింది. బాపు తెరకెక్కించిన ‘మనవూరి పాండవులు’లో నటించాక, మరింత ఉత్సాహంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు భాను. “సత్యం- శివం, ఏది ధర్మం? ఏది న్యాయం?, వంశగౌరవం” చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించారు. ఆ పై “తరంగిణి, ఇద్దరు కిలాడీలు, కుర్రచేష్టలు, గూఢచారి నంబర్ 1, మెరుపుదాడి” వంటి చిత్రాలలో ఇతర హీరోలతో కలసి అలరించారు. “ముక్కుపుడక, నిరీక్షణ, స్వాతి” వంటి చిత్రాలలో హీరోగానూ మెప్పించారు. “టెర్రర్, ఖూనీ, మంచి మిత్రులు, గ్యాంగ్ వార్” వంటి సినిమాలతో మాస్ హీరోగా ఎదిగారు భానుచందర్. ఆ తరువాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ నటిస్తూ సాగారు. ఎందుకనో కొద్దిరోజులకే హీరోగా ఆయన స్టార్ డమ్ మసకబారింది. దాంతో కేరెక్టర్ రోల్స్ కు టర్న్ అయ్యారు. కొన్ని చిత్రాలకు తండ్రి మాస్టర్ వేణు బాటలో పయనిస్తూ స్వరకల్పన కూడా చేశారు భానుచందర్.
భానుచందర్ కేరెక్టర్ రోల్స్ పోషించిన “సింహాద్రి, స్టైల్, దుబాయ్ శీను, బాణం, రెచ్చిపో, ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?, హిట్” వంటి సినిమాలు జనాదరణ చూరగొన్నాయి. ఈ నాటికీ తన దరికి చేరిన పాత్రల్లో అలరించడానికి తపిస్తోన్న భానుచందర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.