సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సిరీస్ ‘భామా కలాపం’. అభిమన్యు దర్శకత్వం వహిస్తుండగా డైరెక్టర్ భరత్ కమ్మ కథను అందించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సిరీస్ ట్రైలర్ ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. కామెడీ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ని తెరకెక్కించినట్లు ట్రైలర్ ని బట్టి అర్దమవవుతుంది.
కథ విషయానికొస్తే.. ఇంట్లో విషయాలకన్నా పక్కింటి విషయాలనే ఎక్కువ పట్టించుకొనే అనుపమ.. యూట్యూబ్ లో కుకింగ్ వీడియోలు చేస్తుంటుంది. ఇక అంతలోనే ఒక మ్యూజియం లో 200 కోట్లు విలువ చేసే గుడ్డు పోతుంది. దానికోసం ఎంతోమంది ఎన్నోరకాలుగా వెతుకుతూ ఉంటారు. ఇక ఆ గుడ్డు కోసం రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపడుతున్న క్రమంలో ఆ గుడ్డుతో తన పాక ప్రావీణ్యాన్ని చూపెడుతోంది అనుపమ. చివరికి ఆ గుడ్డు విలువ తెలిశాక .. అనుపమ పడిన కష్టాలు ఏంటి..? తాను వండింది ఆ గుడ్డునేనా..? అస్సలు గుడ్డు దొంగిలించింది ఎవరు..? చివరికి అనుపమ ఆ గుడ్డును వెతికి పెట్టిందా..? అనేది ట్విస్ట్లుగా చూపించారు. ట్రైలర్ లోనే ట్విస్టులను కట్ చేసి సిరీస్ పై ఆసక్తిని పెంచేశారు మేకర్స్. అనుపమ పాత్రకు జీవం పోసింది ప్రియమణి. ఎంతో నేచురల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ని బట్టి వన్ విమెన్ షో అని తెలుస్తోంది. ఫిబ్రవరి 11 న ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ తో ప్రియమణి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.