Asha Parekh: నాటి మేటి హిందీ నటి ఆశా పరేఖ్ కు 2020 సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేశారు. ఎంపిక చేసిన కమిటీలో హేమామాలిని, ఆశా భోస్లే, పూనమ్ థిల్లాన్, టి.యస్. నాగాభరణ, ఉదిత్ నారాయణ సభ్యులుగా ఉన్నారు. ఆశా పరేఖ్ కీర్తి కిరీటంలో దాదాసాహెబ్ ఫాల్కే ఓ రత్నంలాగా వెలుగనుంది. ఈ నెల 30వ తేదీన 2020 సంవత్సరం నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ ప్రదానోత్సవం సాగనుంది. అందులోనే ఆశా పరేఖ్ కు కూడా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయనున్నారు.
అప్పట్లో ఆశా పరేఖ్ అందం ఎంతోమందికి బంధాలు వేసింది. దేవానంద్, షమ్మీ కపూర్, రాజేశ్ ఖన్నా వంటి స్టార్ హీరోస్ తో నటించి ఆశా పరేఖ్ జైత్రయాత్ర చేశారు. ఆమె 1942 అక్టోబర్ 2న గుజరాత్ లో జన్మించారు. ఆమె తండ్రి బచ్చభాయ్ పరేఖ్ గుజరాతీ హిందూ కాగా, ఆమె తల్లి సల్మా పరేఖ్ బోహ్రా ముస్లిమ్. బాల్యంలోనే ఆమెలోని చలాకీతనం చూసిన తల్లి సల్మా నాట్యంలో చేర్పించారు. పండిట్ బన్సీలాల్ భారతి వంటి ప్రముఖల వద్ద కూడా ఆశా నృత్యంలో శిక్షణ పొందారు. 1952లో బిమల్ రాయ్ తెరకెక్కించిన ‘మా’ చిత్రంలో బేబీ ఆశా పరేఖ్ పేరుతో తొలిసారి తెరపై నటించారామె. ఆ తరువాత “ఆస్మాన్, ధోబీ డాక్టర్, శ్రీచైతన్య మహాప్రభు, బాప్ బేటీ, ఉస్తాద్” వంటి చిత్రాలలోనూ ఆమె బాలనటిగా అలరించారు. పదహారేళ్ళు రాగానే ఆశా హీరోయిన్ వేషాల వేటలో పడ్డారు. విజయ్ భట్ ‘గూంజ్ ఉఠా షెహనాయి’ చిత్రంలో హీరోయిన్ వేషం కోసం పిలిపించి, టెస్ట్ చేశారు. అయితే ఆమెలో హీరోయిన్ మెటీరియల్ లేదని విజయ్ భట్ అవకాశం కల్పించలేదు. తరువాత నిర్మాత శశధర్ ముఖర్జీ, దర్శకరచయిత నాసిర్ హుసేన్ తమ ‘దిల్ దేఖే దేఖో’ చిత్రంలో ఆశా పరేఖ్ ను నాయికగా ఎంచుకున్నారు. షమ్మీ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తరువాత నుంచీ ఆశా మరి వెనుదిరిగి చూసుకోలేదు.
దర్శకరచయిత, నిర్మాత నాసిర్ హుసేన్ తెరకెక్కించిన “జబ్ ప్యార్ కిసీ సే హోతా హై, ఫిర్ వొహీ దిల్ లాయా హూ, తీస్రీ మంజిల్, బహారోంకే సప్నే, ప్యార్ కా మౌసమ్, కారవాన్” చిత్రాలలో నటించి, తన అందచందాలతో విశేషంగా ఆకట్టుకున్నారు ఆశా పరేఖ్. ఈ నాటి మేటి బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కు నాసిర్ హుసేన్ స్వయానా పెదనాన్న. నాసిర్ హుసేన్ అంటే ఆశాకు అభిమానం, ప్రేమ ఉండేవి. అయితే అప్పటికే వివాహితుడై పిల్లలు ఉన్న నాసిర్ తో ఆమె పెళ్ళి అసాధ్యమేనని భావించారు. ఇప్పటికీ అవివాహితగానే ఉండిపోయారు. నాసిర్ పై అభిమానంతోనే 1984లో ఆయన తెరకెక్కించిన ‘మంజిల్ మంజిల్’లో అతిథి పాత్రలో కనిపించారు.
అందరూ ఆశాలోని అందాన్ని ఆరాధిస్తే ఆమెలోని నటికి అవకాశం కల్పించిన వారు రాజ్ ఖోస్లా అనే చెప్పాలి. ఆయన దర్శకత్వంలో ఆశా నటించిన “దో బదన్, చిరాగ్, మై హూ తుల్సీ తేరే అంగన్ కీ” చిత్రాలలో సీరియస్ రోల్స్ లో ఆమె అభినయం ఆకట్టుకుంది. ఈ మూడుచిత్రాలను తన ఫేవరెట్స్ గా చెప్పుకుంటారు ఆశా. శక్తి సామంత తెరకెక్కించిన “పగ్లా కహీ కా, కటీ పతంగ్” చిత్రాలు సైతం ఆమెకు నటిగా మంచి పేరు సంపాదించి పెట్టాయి. తన మాతృభాష గుజరాతీలోనూ, పంజాబీ చిత్రాలలోనూ ఆమె నటించి అలరించారు.
హీరోయిన్ గా అవకాశాలు తగ్గగానే తన దరికి చేరిన అక్క, వదిన, అమ్మ పాత్రల్లో కనిపించారు. అయితే అవేవీ ఆమెకు సంతృప్తి కలిగించలేదు. దాంతో గౌరవంగా తప్పుకున్నారు. 1994 నుండి 2000 వరకు ‘సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కు ఆమె అధ్యక్షురాలుగా ఉన్నారు. సెంట్రల్ సెన్సార్ బోర్డ్ కు 1998 నుండి 2001 వరకు ఆశా పరేఖ్ ఛైర్ ఉమన్ గా పనిచేశారు. ఆ పదవిలో కొనసాగిన తొలి మహిళగానూ ఆశా నిలచిపోయారు. కొన్ని టీవీ సీరియల్స్ కు దర్శకనిర్మాతగానూ ఆమె వ్యవహరించారు. 1992లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆశా సెన్సార్ బోర్డ్ ఛైర్ పర్సన్ గా ఉన్న సమయంలోనే శేఖర్ కపూర్ తెరకెక్కించిన ‘ఎలిజబెత్’కు సర్టిఫికెట్ ఇవ్వడంలో పలు నిబంధనలు విధించడం అప్పట్లో చర్చనీయాంశమయింది. అలాగే ఆశా హయాములో పలు చిత్రాల సెన్సార్ విషయంలోనూ ఆమె నిర్ణయాలు వివాదస్పదంగానూ మారాయి. ఏది ఏమైనా హిందీ చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన ఆశా పరేఖ్ ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేయడం పట్ల హిందీ చిత్రసీమలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.