Taliban: ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఒక యంగ్ స్టూడెంట్‌ని ముంబైలో తమ దేశం తరుపున రాయబారిగా నియమించింది. ఆఫ్ఘాన్ విద్యార్థి ఇక్రముద్దీన్ కమిల్‌ని ముంబైలోని ఆఫ్ఘనిస్తాన్ కాన్సులేట్‌లో యాక్టింగ్ కాన్సుల్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబాన్లను భారత్ గుర్తించలేదు. తాజాగా తాలిబాన్లు భారత్‌లో చేసిన తొలి నియామకం ఇక్రముద్దీన్‌దే అవుతుంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత భారతదేశం తన దౌత్యవేత్తలను కాబూల్‌తో పాటు ఆ దేశంలోని ఇతర నగరాల నుంచి ఉపసంహరించుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం నియమించిన దౌత్యవేత్తలు భారతదేశాన్ని వదిలిపెట్టి వేరే దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
అయితే, భారత్ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించనప్పటికీ, ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. పలు సందర్భాల్లో అక్కడి ప్రజలకు అవసరమైన వస్తువులు భారత్ నుంచి వెళ్లాయి. తాలిబన్లు కూడా భారత్‌ని పలు సందర్భాల్లో పొగిడారు. తమ దేశంలో దౌత్యవేత్తలను నియమించాలని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, దేశ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్-ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి JP సింగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆఫ్ఘనిస్తాన్‌లో పర్యటించి కాబూల్‌లో తాలిబాన్ తాత్కాలిక రక్షణ మంత్రి ముల్లా మహ్మద్ యాకూబ్‌తో చర్చలు జరిపిన కొద్ది రోజుల తర్వాత మిస్టర్ కామిల్ నియామకం జరిగింది. తాలిబాన్ రాజకీయ వ్యవహారాల డిప్యూటీ విదేశాంగ మంత్రి షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ మంగళవారం ఎక్స్‌లో మిస్టర్ కామిల్ నియామకాన్ని ప్రకటించారు.
కమిల్ భారత్‌లో ఏడేళ్లు చదువుకున్నాడు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన స్కాలర్‌షిప్‌పై ఢిల్లీలోని దక్షిణాసియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డాక్టరేట్‌ను అభ్యసించారు. అతను ముంబైలో ఉన్నాడని ఇప్పటికే తన విధులు నిర్వర్తిస్తున్నాడని సమాచారం. భారత్ అధికారికంగా స్పందించనప్పటికీ.. అతను భారత దేశంలో ఆప్ఘన్ల కోసం పనిచేస్తున్న ఆఫ్ఘన్ జాతీయుడిగా గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.